విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తుమన్నారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయన్న కేంద్రమంత్రి, వరదలతో ఆంధ్రప్రదేశ్ కు వాటిల్లిన నష్టాన్ని ప్రధాని మోదీకి వివరిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కేంద్ర కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించిన తర్వాత కేంద్రం ఆర్థికసాయం ప్రకటిస్తుందని వివరించారు. బుడమేరు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన కేంద్రమంత్రి, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు, వరద పోటు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమించారని కొనియాడిన కేంద్రమంత్రి డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు అందించడం మంచి విషయం అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ప్రశంసించారు.
కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమై రాష్ట్రానికి వరద సాయంపై చర్చించారు. కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.