గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల వాష్‌రూముల్లో రహస్య కెమెరాలు పెట్టి కొందరు వీడియోలు చిత్రీకరించారంటూ వచ్చిన వార్తలో నిజం లేదని ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీఈఆర్‌టీ నిపుణులు కూడా కెమెరాలు పెట్టిలేదని తేల్చి చెప్పినట్లు ఆయన తెలిపారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 35 మంది విద్యార్థినులు, మహిళా పోలీసులు కాలేజీ వాష్‌రూములన్నీ పరిశీలించినా ఎక్కడా ఒక్క కెమెరా కూడా లభ్యం కాలేదన్నారు.
పుణే నుంచి వచ్చిన సి డాక్ బృందం కూడా కెమెరాల ఆచూకీ లభించలేదని చెప్పినట్లు ఐజీ తెలిపారు. అసత్య ప్రచారం చేసిన వారిని వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. ఓ కేసు విచారణకు సీఈఆర్‌టీ నిపుణులను రప్పించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. ఎక్కడో తీసిన వీడియోలను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థునుల వాష్ రూంలో చిత్రీకరించారంటూ ఫేక్ ప్రచారం చేసిన వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. అసత్య ప్రచారాలు నమ్మ వద్దని సూచించారు.