ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే దేశానికి ఐదు పతకాలు వచ్చాయి. దీంతో భారత సాధించిన పతకాల సంఖ్య 20 కి చేరింది. 2021లో టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు 19 పతకాలు సాధించారు. ఆ రికార్డును ప్రస్తుతం బ్రేక్ చేశారు. ఇంకా నాలుగు పోటీల్లో భారత అథ్లెట్లు పాల్గొనాల్సి ఉంది. భారత్ , 3 స్వర్ణాలు, 7 రజతం, 10 కాంస్య పతకాలు తన ఖాతాలో వేసుకుంది.
తెలుగు తేజం దీప్తి మహిళల 400 మీటర్ల పరుగుపందెంలో మూడో స్థానం సాధించి, కాంస్యం అందుకున్నారు. ఆర్చరీలో పూజా ఖన్నా క్వార్టర్ ఫైనల్స్ లో ఓడారు. జావెలిన్ త్రో (పురుషులు) లో అజీత్ సింగ్, సుందర్ గుర్జార్ అద్భుతమైన ప్రతిభ చూపి వరుసగా రెండు, మూడో స్థానాలను కైవసం చేసుకున్నారు.
పురుషుల హైజంప్ పోటీల్లో శరద్ కుమార్ రజత పతకం సాధించగా.. మరియప్పన్ థంగవేలు కాంస్య పతకాన్ని సాధించారు. దీంతో పారాలింపిక్స్ పతకాల పట్టిక లో భారత్ 17వ స్థానంలో నిలిచింది.