వరద ముంపు ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయవాడలో నీట మునిగిన సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, నందమూరినగర్, తోటవారివీధి, రాజరాజేశ్వరిపేట, దేవీనగర్ ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయి. అనేక కాలనీల్లో మొదటి అంతస్తులు మునిగిపోవడంతో, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ సరఫరా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందని మరో రెండు రోజుల తరవాత పునరుద్దరిస్తామని అధికారులు చెబుతున్నారు.
విజయవాడ వీటీపీఎస్‌లో వరద చేరింది. ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ మోటార్లతో నీటిని తోడి పోస్తున్నారు. సోమవారం సాయంత్రం రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. బుధవారం సాయంత్రానికి అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. వరద ముంపు ప్రాంతాలు మినహా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మంత్రి రవికుమార్ అధికారులను ఆదేశించారు.