ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన తెలుపుతోన్న మహిళా డాక్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. కోల్‌కతా ఆర్జి కర్ ఆసుపత్రి సమీపంలో నిరసన తెలుపుతోన్న డాక్టర్ల వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని స్టేషన్‌ను తరలించి, కొద్ది సేపటికే వదిలేశారు. దీంతో డాక్టర్లు పోలీస్ కమిషనరేట్ ముందు నిరసనకు దిగారు. దుండగుడి మానసిక స్థితి సరిగా లేదని అందుకే అతన్ని వదిలేశామని పోలీసులు చెబుతున్నారు.
డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు మరలా ప్రయత్నాలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన మరవక ముందే బోల్పుర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుపై రోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. వరుస ఘటనలతో బెంగాల్లో డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్జి కర్ ఘటనకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రతి రోజూ బెంగాల్ డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చినా నిరసనలు చల్లారడం లేదు.