వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద మాత్రం గంట గంటకు పెరుగుతోంది. విజయవాడలో బుడమేరుసహా, మునేరు, వైరా వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నగరంలో నుంచి ప్రవహించే బుడమేరుకు భారీ వరద చేరింది. నగరంలోని 46 కాలనీలు నీట మునిగాయి. సింగ్‌నగర్, నందమూరినగర్, రాజరాజేశ్వరిపేట, కండ్రిగ, తోటవారివీధి, దేవీనగర్ నీట మునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పర్యటించారు.
కృష్ణమ్మ వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తోన్న వరదకు తోడు తెలంగాణలో కురిసిన అతి భారీ వర్షాలకు మునేరు, మూసీ నుంచి భారీగా వరద చేరుతోంది. రేపటికి ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కుల వరద చేరే ప్రమాద ముందని అధికారులు అంచనా వేశారు. కొండవీటి వాగు పొంగింది. రాజధాని ముంపును తొలగించే కొండవీటి లిఫ్ట్ ద్వారా వరద నీటిని తోడిపోస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లోనూ వరద ముంచెత్తింది.
విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వరద చేరింది. కంచికచర్ల, తెలంగాణ సరిహద్దుల్లో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పలు రైళ్లు రద్దు చేశారు. రాయనపాడు రైల్వే స్టేషన్లోకి వరద చేరింది. విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టాలపైకి వరద చేరింది. సింగ్ నగర్ ప్రాంతంలో పట్టాలు నీట మునిగాయి. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలును రాయనపాడులో నిలిపేశారు. వేలాది మంది ప్రయాణీకులు వరదలో చిక్కుక్కుపోయారు. 70కిపైగా రైళ్లు రద్దు చేశారు. కొన్ని రైళ్లు దారి మళ్లించారు. మరో 48 గంటలు జాగ్రత్తగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.