విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారతీయులను మోసం చేసి లావోస్‌లో సైబర్ నేరగాళ్లుకు చిక్కిన భారతీయులకు విముక్తి లభించింది. భారతీయ యువతతో సైబర్ నేరాలు చేయిస్తోన్న మాఫియా నుంచి భారత రాయబారి ప్రశాంత్ అగర్వాల్ 47 మందిని విడిపించారు. లావోస్, కంబోడియాల్లో ఉద్యోగాల పేరుతో యువతకు గాలం వేసి వారిని దుబాయ్ మీదుగా తరలిస్తున్నారని గుర్తించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావోస్‌లోని భారత రాయబారి ప్రశాంత్ అగర్వాల్, అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. 47 మందిని సైబర్ వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. వారిలో 30 మంది భారత్‌కు బయలు దేరారు. మరో 17 మంది రెండు రోజుల్లో ఢిల్లీ చేరుకోనున్నారని అగర్వాల్ తెలిపారు.
దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో మోసం చేసి, అక్కడ నుంచి ఆఫ్రికా దేశాలకు యువతను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో దళారులు చేస్తోన్న మోసాలకు బలికావద్దని వారు హెచ్చరిస్తున్నారు. ముందుగా దుబాయ్ పేరు చెప్పి, అక్కడకు తరలించి అక్కడకు వెళ్లిన తరవాత ఉద్యోగాలు లేవని బెదిరించి, ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. నిరుద్యోగ యువత విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మాఫియాకు (cyber crime) చిక్కవద్దని విదేశాంగశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.