హత్యాచార ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతున్న తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసి దేశ వ్యతిరేక, ఒడిషా వ్యతిరేక వ్యాఖ్యలపై ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మండిపడ్డారు. ఒడిషా గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి నీకు హక్కు ఎక్కడిది అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేసారు.
‘‘ఒడిషా ప్రశాంతమైన రాష్ట్రం. మా ప్రజలు బాధ్యతాయుతంగా ఉంటారు, వారికి అన్ని విషయాలూ సమగ్రంగా తెలుసు. మీ ద్వేషపూరిత వైఖరిని, ప్రతికూల వ్యాఖ్యలను, మా రాష్ట్రం మీద అసహనంతో కూడిన మీ ప్రవర్తననూ మా ప్రజలు సహించరు’’ అని మోహన్ చరణ్ మాఝీ రాసుకొచ్చారు.
‘‘ఘోరమైన నేరానికి బలైపోయిన మృతురాలికి న్యాయం చేయాల్సిన విషయాన్ని పట్టించుకోకుండా మీరు చేసిన వ్యాఖ్యలు అసందర్భమైనవి మాత్రమే కాదు, జాతీయ సమైక్యతకు భంగం కలిగించేవి కూడా. అటువంటి విద్వేషకర వ్యాఖ్యలు చేయవద్దని అర్ధిస్తున్నాను’’ అని ఆయన మమతా బెనర్జీని కోరారు.
బుధవారం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్ధి విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడిన మమతా బెనర్జీ ‘‘ఒక విషయం గుర్తుంచుకోండి, బెంగాల్ తగులబడితే అస్సాం, బిహార్, ఝార్ఖండ్, ఒడిషా, ఢిల్లీ కూడా తగులబడిపోతాయి’’ అని వ్యాఖ్యానించారు.
కోల్‌కతాలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రాజేసింది. ఆ ఘటనకు ప్రతిగా విద్యార్ధి సంఘాలు ఆందోళన చేస్తే వాటిని రాజకీయ ప్రేరేపితమైనవి అంటూ వారిపై పోలీసులతో లాఠీఛార్జి చేయించింది మమతా బెనర్జీ ప్రభుత్వం. దానికి నిరసనగా బుధవారం బిజెపి బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా మమతా బెనర్జీ అలాంటి వ్యాఖ్యలు చేసింది. తమ రాష్ట్రంలో తమ చేతకానితనం వల్ల తలెత్తిన సమస్యలోకి మమతా బెనర్జీ ఇతర రాష్ట్రాలను లాగడం విమర్శలకు తావిచ్చింది.
ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ తన ట్వీట్లో, కోల్‌కతా హత్యాచార ఘటన గురించి రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, మృతురాలి పట్ల సానుభూతి లేని దుర్మార్గాన్నీ బైటపెట్టాయన్నారు. తృణమూల్ పాలనలో పశ్చిమబెంగాల్లో మహిళలపై హింస, అణచివేత పెరిగిపోయాయని ఆరోపించారు.
‘‘స్వయంగా తనే మహిళ అయినప్పటికీ, తమ రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో మమతా బెనర్జీ విఫలమయ్యారు. ఆమె అధికార కాంక్ష కారణంగా మహిళల భద్రత నిర్లక్ష్యానికి గురయింది. అంతేకాదు, ఆమె దేశంలో విభజనలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలు చివరికి విఫలమే అవుతాయి. ఆమె చర్యలకు ప్రజలు ఆమెను బాధ్యురాలిని చేస్తారు, సరైన సమయంలో స్పందిస్తారు’’ అంటూ మోహన్ మాఝీ తన ఆగ్రహాన్ని ప్రకటించారు.