భారతీయ సంప్రదాయం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఆ రోజునే కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా అంటారు. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించిన పర్వదినమది. హిందువులు, ప్రత్యేకించి వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు అమిత శ్రద్ధాసక్తులతో ఆ పండుగ చేసుకుంటారు. కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఉపవాసం ఉండి, రాత్రంతా నృత్యగీతాలతో వేడుక చేసుకుంటారు.
శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో దేవకీ వసుదేవులకు జన్మించాడు. కంసుడు దేవకి సోదరుడు. తన చెల్లెలికి పుట్టే ఎనిమిదవ కొడుకు చేతిలో తను మరణిస్తాడన్న విషయం తెలుసుకున్న కంసుడు దేవకీ వసుదేవులను జైలులో నిర్బంధిస్తాడు. దేవకికి ఎనిమిదవ సంతానంగా పుట్టిన కృష్ణుడిని వసుదేవుడు గోవర్ధన పర్వతం దగ్గరి గోకులంలో యశోదా నందుల నివాసంలో విడిచిపెడతాడు. కృష్ణుడు గోకులంలో మిత్రులతో ఆడుకుంటూ, ఆవులను మేపుతూ, వెన్న దొంగతనం చేస్తూ, రాక్షసులను చంపుతూ ఎన్నో లీలలు చూపిస్తాడు. ఆ క్రమంలోనే ప్రజాకంటకుడైన కంసుణ్ణి కూడా వధిస్తాడు. మహాభారత కాలంలో అర్జునుడి రథసారధిగా నిలబడి ధర్మాత్ములైన పాండవులు విజయం సాధించేలా చేస్తాడు.
యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం (గీత 4.7)
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే (గీత 4.8)
‘‘ధర్మానికి నష్టం వాటిల్లిన ప్రతీసారీ, దాన్ని నిలబెట్టడానికి అవతరిస్తాను. సాధువులను రక్షించడానికి, దుష్కర్ములను నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికీ ప్రతీ యుగంలోనూ అవతరిస్తాను’’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా తన అవతార ప్రయోజనాన్ని వివరించాడు.
కృష్ణాష్టమి పూజా విధానం:
జన్మాష్టమి వేడుకలు ప్రధానంగా మథుర, బృందావనం కేంద్రంగా జరుగుతాయి. అయితే ఇప్పుడా వేడుకలు ప్రపంచవ్యాప్తం అయ్యాయి. భారతదేశంలోని ప్రతీమూలా కన్నయ్యను పూజించి, కృష్ణాష్టమి వేడుకలు జరపడం ఆనవాయితీగా మారింది.
కృష్ణాష్టమి రోజున భక్తులు ఉపవాసం ఉండి, రాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేకించి, కృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడు కాబట్టి ఆ సమయంలో పూజ చేస్తారు. ఇళ్ళలోనూ దేవాలయాలలోనూ కృష్ణుడి అందమైన మూర్తిని మరింత శోభాయమానంగా మెరిసిపోయేలా చక్కటి దుస్తులు, ఆభరణాలతో అలంకరిస్తారు. పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నేయి, చక్కెరతో అభిషేకం చేస్తారు. భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. భగవత్కథా కాలక్షేపం చేస్తారు.
కృష్ణాష్టమి రోజు ఉట్టికొట్టే వేడుక వైభవంగా జరుపుతారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రధానంగా దహీ హండీ పేరుతో వేడుక చేస్తారు. ఉట్టిలో పెరుగు, తేనె వంటి పదార్ధాలు వేసి దాన్ని ఎత్తులో కడతారు. యువకులు ఉట్టి కొట్టడానికి చేసే ప్రయత్నాలు వేడుకగా ఉంటాయి. కృష్ణుడి జీవిత ఘట్టాలతో రాసలీల నాట్యం ఆడతారు. ప్రత్యేకంగా తయారుచేసిన నైవేద్యాలు స్వామికి నివేదనం చేసి, తర్వాత భక్తులకు పంచుతారు.
దేశంలోని వేర్వేరుప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు:
మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో కృష్ణాష్టమిని ఒక్కొక్కలా జరుపుకుంటారు. ప్రతీ ప్రాంతానికీ తమదైన ప్రత్యేకత ఉంటుంది. స్థానిక ఆచార వ్యవహారాలూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిఫలిస్తూ వేడుకలు జరుగుతాయి. కృష్ణాష్టమి సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని ఆలయాలన్నీ ప్రత్యేకంగా అలంకరిస్తారు.
ఉత్తరప్రదేశ్:
కృష్ణుడు జన్మించిన మథురలో జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ప్రత్యేక అలంకరణలతో ప్రకాశించే కృష్ణాలయాల్లో భక్తులు పూజలు చేస్తారు. రాత్రంతా భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. బృందావనంలో రాసలీల నిర్వహిస్తారు. గోకులంలో దహీ హండీ (ఉట్టి కొట్టే) వేడుకలు సంబరంగా జరుగుతాయి. కృష్ణుడిని చిన్నారి బాలుడిగా భావించి మధుర పదార్ధాలు ఆరగింపజేస్తారు.
ఢిల్లీ:
దేశ రాజధానిలో ఇస్కాన్ మందిరం, లక్ష్మీనారాయణ మందిరం తదితర కృష్ణ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. రంగురంగుల పూలు, అలంకారాలతో పాటు శకటాలు కూడా శోభాయమానంగా ఉంటాయి.
మహారాష్ట్ర:
ఈ రాష్ట్రంలో ఉట్టి కొట్టే దహీ హండీ అతిపెద్ద వేడుక. పెరుగు, తేనె, ఇతర పదార్ధాలూ నింపిన ఉట్టిని ఎత్తులో కడతారు. దాన్ని కొట్టడానికి యువకులు ఒకరిమీద ఒకరు ఎక్కి పెద్దపెద్ద మానవ గోపురాల్లా ఏర్పడతారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దహీ హండీ పోటీలు కూడా జరుగుతాయి. పుణేలోని శ్రీకృష్ణ మందిరంలో విశేష పూజలు జరుగుతాయి. రాత్రంతా భజనలు, కీర్తనలు పాడడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
గుజరాత్:
ఈ రాష్ట్రంలో ద్వారకలోని ద్వారకాధీశ మందిరం ప్రత్యేక ఆకర్షణ. కృష్ణాష్టమి రోజు ఈ ఆలయం అంతటినీ దీపాలతో వెలిగిస్తారు. ప్రజలు ప్రత్యేకమైన పిండివంటలు చేస్తారు. పిల్లలను కృష్ణుడిలా అలంకరిస్తారు. సాయంత్రం వేళల్లో రాసలీల సహా కృష్ణుడి జీవిత ఘట్టాలను ప్రదర్శిస్తారు.
రాజస్థాన్:
ఉదయపూర్, జైపూర్ నగరాల్లో ప్రత్యేక పూజలు, రాసలీల నిర్వహిస్తారు. ప్రజలు సంప్రదాయిక రాజస్థానీ దుస్తులు ధరిస్తారు. ఆలయాలన్నీ గొప్పగా అలంకరిస్తారు. భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. రాసలీల ప్రదర్శిస్తారు.
ఒడిషా:
పూరీలోని ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ స్వామి ఆలయంలో జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. పూరీ వీధులన్నీ అందంగా అలంకరిస్తారు. ఒరియా సంప్రదాయ సంగీతంలో గీతాలు ఆలపిస్తారు.
తమిళనాడు:
బాలకృష్ణుడి చిన్నిపాదాల ముద్రలతో ఇళ్ళను అలంకరిస్తారు. పిల్లలను కన్నయ్యలా అలంకరించి నాట్యం చేయిస్తారు. అర్ధరాత్రి వరకూ ఉపవాసముండి పూజలు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్/తెలంగాణ:
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి సందర్భంగా గోపూజా దినోత్సవం జరుపుకుంటారు. ఆవులను అందంగా అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. గోవుమాలచ్చిమి అంటూ పూజలు చేస్తారు.
అలా దేశవ్యాప్తంగా కృష్ణుడి పుట్టిన రోజును భక్తిశ్రద్ధలతో వైభవంగా పండుగ చేసుకుంటారు. ప్రాంతాలను బట్టి స్థానిక సంస్కృతిని, ఆచార వ్యవహారాలనూ ప్రతిబింబించేలా ఉత్సవం నిర్వహిస్తారు. భారతదేశపు సాంస్కృతిక వైవిధ్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికీ ఈ పండుగ ఓ ఉదాహరణ.
ఈ 21వ శతాబ్దంలో కృష్ణాష్టమి కేవలం భారతదేశంలోనే కాక, భారతీయులు వ్యాపించిన ప్రతీ దేశంలోనూ ఉల్లాసోత్సాహాలతో జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ప్రపంచంలోని పలు దేశాల్లో కృష్ణలీలలను, కృష్ణబోధనలనూ ప్రచారం చేస్తోంది. వివిధ దేశాల భక్తులు సైతం కృష్ణాష్టమిని వైభవంగా జరుపుకుంటారు.