పంద్రాగస్టు సందర్భంగా తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా జరిగాయి. గుజరాత్లో అలాంటి ఒక తిరంగా యాత్రను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కారణం, ఆ యాత్రలో పాల్గొన్న విద్యార్ధులు కాషాయ రంగు టీషర్టులు ధరించడం, వాటిమీద వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ల బొమ్మలు ఉండడమే.
గుజరాత్, సురేంద్రనగర్ జిల్లా, సంగానీ గ్రామంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నిర్వహించిన తిరంగా యాత్రలో స్థానిక పిల్లలు పాల్గొన్నారు. వారిలో కొంతమంది కాషాయ రంగు టీషర్టులు ధరించారు. ఆ టీషర్టులపై సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మలున్నాయి. దాన్ని కాంగ్రెస్ నాయకులు గమనించారు. వెంటనే, విద్యార్ధులను ఆ టీషర్టులు విప్పేయాల్సిందిగా డిమాండ్ చేసారు.
అక్కడితో ఆగలేదు. ఆ కాంగ్రెస్ నాయకులు ప్రతికూల వ్యాఖ్యలు చేసారు. సావర్కర్ గురించి తప్పుడు ఆరోపణలు చేసారు. మహాత్మా గాంధీ హత్యలో సావర్కర్ ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలను పదేపదే ప్రచారం చేసారు. కోర్టులు సైతం తప్పు అని నిర్ధారణ చేసిన ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం వదలడం లేదు.
ఆగస్టు 15కు ముందు జరిగిన ఆ సంఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హరీష్ సంఘ్వీ మాట్లాడుతూ, ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న కాంగ్రెస్ నాయకులపై, స్వాతంత్ర్య సమర యోధులను అవమానించిన ఆరోపణలపై కేసు నమోదయిందని వెల్లడించారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్, వినాయక్ దామోదర్ సావర్కర్ల దేశభక్తిని పరీక్షించే స్థాయి లేదని మండిపడ్డారు.
ఆగస్టు 14న స్థానిక కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్ర పేరిట ఒక యాత్ర చేపట్టింది. ఆ యాత్రకు ఎదురుగా తిరంగా యాత్ర చేస్తున్న విద్యార్ధులు వచ్చారు. వారిని కాంగ్రెస్ నాయకులు నిలువరించారు, వారి టీషర్టుల మీద వ్యాఖ్యలు చేసారు. ‘‘స్కూల్ డ్రెస్‌లో కూడా అణచివేస్తున్నారు. వాళ్ళు బహిరంగంగానే ఆరెస్సెస్ సావర్కర్ ముద్రలు వేసుకుని తిరుగుతున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో వైరల్ అయిపోయింది.
సావర్కర్, నేతాజీ బొమ్మలున్న కాషాయరంగు టీషర్ట్ పిల్లలు వేసుకోడానికి అనుమతి ఇచ్చినందుకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లను ఒక నాయకుడు దూషించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు పిల్లలతో ఆ టీషర్టులు విప్పించేసారు. గాంధీ, సర్దార్ పటేల్‌లను విస్మరించి సావర్కర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసారు. విచిత్రం ఏంటంటే… భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులు కూడా టీషర్టులే ధరించి ఉన్నారు. వాటిమీద కూడా గాంధీ, పటేల్ బొమ్మలు లేవు.