ఆర్జీ కార్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి నిరసన పేరుతో దాడి చేయడంపై కోల్‌కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారుల ముసుగులో దుండగులు జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య జరిగిన ప్రాంతంలో విధ్వంసం చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ విఫలమైందని ధర్మాసనం సీరియస్ అయింది. దుండగులు డాక్టర్‌ని అత్యాచారం, హత్య చేసిన ప్రాంతం కోసం బుధవారం రాత్రి వెతికారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాలు చెరిపేసేందుకే వారు అలా చేశారని వాదించారు. అదృష్ణవశాత్తూ ఘటన జరిగిన ప్రాంతాన్ని వారు గుర్తించలేకపోయారని న్యాయవాది తెలిపారు.
వేలాది మంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ( kolkata highcourt) ప్రశ్నించింది. ఆసుపత్రిలో ఇంకా ఎంత మంది రోగులు చికిత్స పొందుతున్నారో తెలపాలని, ఆసుపత్రిని మూసివేస్తామని హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారు.విధ్వంసకారులు ముసుగులు ధరించి కర్రలు, రాళ్లు తీసుకుని ఆసుపత్రిలో చొరబడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించామని, భాష్పవాయుగోళాలను కూడా ప్రయోగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం కేసును సాయంత్రంలోకా తేల్చాలంటూ సీబీఐకి బెంగాల్ సీఎం అల్టిమేటం జారీ చేశారు. బెంగాల్ పోలీసులు 90 శాతం కేసు విచారణ పూర్తి చేశారని వెంటనే దోషులను గుర్తించి, కఠిన శిక్ష విధించాలంటూ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. కేసును వెంటనే తేల్చాలంటూ ఇవాళ సాయంత్రం నిరసనకు పిలుపునిచ్చారు.