ఇవాళ ‘దేశ విభజన బీభత్సాల సంస్మరణ దినం’ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు దేశ విభజన బాధితులకు నివాళులర్పించారు. విభజన వేళ వారు చూపిన ఆత్మస్థైర్యానికీ, ధీరత్వానికీ జోహార్లర్పించారు.
‘‘దేశ విభజన బీభత్సాల వల్ల ప్రభావితులైన, బాధలు అనుభవించిన అసంఖ్యాక ప్రజలను ఇవాళ స్మరించుకుందాం. విభజన అరాచకాలను తట్టుకుని నిలబడగలిగిన వారి ధైర్యానికి, స్థైర్యానికీ నివాళులు. దేశ విభజన వల్ల తీవ్రంగా ప్రభావితులైన వారు ఆ గాయాలను తట్టుకుని తమ జీవితాలను పునర్నిర్మించుకుని విజయాలను సాధించారు. వారి స్ఫూర్తితో ఐక్యతా బంధాలను, సౌభ్రాతృత్వాన్ని రక్షించుకోడానికి మన నిబద్ధతను పునఃప్రకటించుకుందాం’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేసారు.
‘‘దేశ విభజన లక్షలాది ప్రజల జీవితాల్లో ఊహించలేనంత వేదనను మిగిల్చింది. లక్షల మంది తమ జీవితాలను కోల్పోయారు. ప్రపంచ చరిత్రలోని అత్యంత క్రూరమైన విభజనలో లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఆ చరిత్రను గుర్తు చేసుకోవడం, దాన్నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా మాత్రమే ఒక దేశం భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలదు, బలం పుంజుకోగలదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఈ దినాన్ని జరుపుకోవడం జాతి నిర్మాణంలో ఓ కీలకమైన ముందడుగు’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేసారు.
‘‘1947లో ఈ రోజు మన దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేసారు. ఆ వివక్ష, చెడు తలంపుల కారణంగా లెక్కలేనంత మంది మన సోదరీసోదరులు దిక్కూమొక్కూ లేనివారు అయిపోయారు, వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. విభజన బాధలను సహించిన అసంఖ్యాకమైన కుటుంబాలకు నివాళులు’’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ట్వీట్ చేసారు.
కేంద్రమంత్రులు శర్బానంద సోనోవాల్, డాక్టర్ జితేంద్రసింగ్ కూడా దేశ విభజన బాధితులకు నివాళులర్పించారు. దేశ విభజన సమయాన తమ ధనమానప్రాణాలను త్యాగం చేసిన భారతీయుల సాక్షిగా దేశంలో విభజనవాదానికి వీడ్కోలు పలకాలని పిలుపునిచ్చారు.