అమెరికాలోని పాలస్తీనా అనుకూలవాదుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా న్యూయార్క్ నగరంలో ఒక వ్యక్తి ఒక యూదు యువకుణ్ణి కత్తితో పొడిచిన ఘటన చోటు చేసుకుంది.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారడానికి ముందు యూదు యువకుడిపై ఒక ఆగంతకుడు దాడి చేసాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న యూదు మతగురువు (రబ్బీ) యాకోవ్ బెహర్మాన్ ఆ సంఘటన గురించి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసాడు.
బెహర్మాన్ ట్వీట్ ప్రకారం, శనివారం ఉదయం యూదువ్యక్తి దగ్గరకు ఒక నల్లజాతి యువకుడు వచ్చాడు. ‘నువ్వు చావాలనుకుంటున్నావా’ అని అడిగాడు. యూదు యువకుడు స్పందించేలోగా అతన్ని కత్తితో పొడిచాడు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు ఆ నల్లజాతి యువకుణ్ణి పట్టి బంధించి పోలీసులకు అప్పగించారు. బాధితుణ్ణి ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉంది.
‘‘చాబాద్ ప్రధాన కార్యాలయానికి దగ్గర ఈస్టర్న్ పార్క్‌వే, కింగ్స్టన్ ఎవెన్యూలకు చేరువలో, శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఈ విద్వేషదాడి ఘటన జరిగింది. యూదు యువకుణ్ణి నల్లజాతి వ్యక్తి పొడిచాడని నేను ధ్రువీకరించగలను’’ అని బెహర్మాన్ రాసుకొచ్చాడు.
‘‘నల్లజాతికి చెందిన సుమారు 20యేళ్ళ వయసున్న యువకుడు మొదట ‘పాలస్తీనాను విముక్తం చేయండి’ అంటూ అరిచాడు. బాధితుడితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ‘నువ్వు చావాలనుకుంటున్నావా’ అంటూ బాధితుణ్ణి కత్తితో పొడిచాడు’’ అంటూ సంఘటనా క్రమాన్ని వివరించాడు.
‘‘ఇది చాలా దారుణమైన సంఘటన. బాధితుడు చనిపోయి ఉండేవాడు. ఇది విద్వేషహింసకు సంబంధించిన సంఘటన. అమెరికా అంతటా, ముఖ్యంగా న్యూయార్క్‌లోనూ కొందరు స్థానిక రాజకీయ నాయకులు విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. అలాంటి రెచ్చగొట్టే చర్యల ఫలితమే ఈ ప్రమాదకర సంఘటన’’ అని బెహర్మాన్ అభిప్రాయపడ్డాడు.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద ఉగ్రవాద దాడి చేసిన తర్వాత అమెరికాలో అటువంటి ద్వేష ప్రసంగాలు, యూదు వ్యతిరేక ఆందోళనలూ పెచ్చుమీరాయి. విశ్వవిద్యాలయాల్లో సైతం యూదు వ్యతిరేక, పాలస్తీనా అనుకూల నిరసన కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు