బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పూర్తిస్థాయి హిందూవ్యతిరేక హింసాకాండగా మారిపోయాయి. ఇస్లామిస్టులు ఇంటింటికీ వెళ్ళి హిందువులను చంపేస్తున్నారు. హిందువుల ఇళ్ళను, గుళ్ళను వెతికి పట్టుకుని వెళ్ళి మరీ దాడులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దోపిడీలు, ఆస్తుల విధ్వంసాలు, ఇళ్ళు తగులబెట్టడాలు, హిందువులను చంపేయడాలు జరుగుతున్నాయి. ఇంక హిందూమహిళలపై అత్యాచారాలు ఆగడమే లేదు.
దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను లక్ష్యం చేసుకుని ధ్వంసం చేస్తున్నారు. నాటోరే, ఢాకాలోని ధామ్‌రాయ్, పటువాఖలీలోని కాలాపరా, షరియత్‌పూర్, ఫరీద్‌పూర్‌లలో ఆలయాలను కూల్చేసారు. జెస్సోర్, నవఖాళీ, మెహెర్‌పూర్, చాంద్‌పూర్, ఖుల్నా తదితర ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరిగాయి. దినాపూర్‌లో హిందువులకు చెందిన 40 దుకాణాలను ధ్వంసం చేసారు. ఆ హింసాకాండలో నిర్దుష్టంగా హిందూ మహిళలను లక్ష్యం చేసుకున్నారు.
పిరోజ్‌పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో హిందూ మహిళలపై అమానుషంగా అత్యాచారాలు జరిగాయి. ‘‘వాళ్ళు కత్తులు, పదునైన ఆయుధాలు పట్టుకుని వచ్చారు. ఇల్లంతా దోచుకున్నారు. మా అమ్మాయిల మీద పడ్డారు. వారిని రక్షించడం కోసం మేం అడ్డం పడ్డాం’’ అని ఒకామె చెప్పింది.
‘‘వాళ్ళు రాత్రివేళ వచ్చారు, మా ఇళ్ళను ధ్వంసం చేసారు. అంతా దోచుకున్నారు. మేం దాక్కున్నాం. మా బావ భార్య దొరికిపోయింది. ఆమెను ఓ గదిలోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేసారు. ఆమె ముఖాన్ని కట్టేసారు. ఆమె పీక కోసేయబోయారు. చివరికి, బంగారు ఆభరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు’’ అని ఒక మహిళ చెప్పింది.
‘‘ఆ రాత్రి మేం నిద్రపోతున్న సమయంలో వాళ్ళు ఆయుధాలతో వచ్చారు. ‘మేం యాభై మందిమి ఉన్నాము, మీరు మానుంచి తప్పించుకోలేరు’ అని వారు మమ్మల్ని బెదిరించారు. వాళ్ళు మా ఇళ్ళనన్నింటినీ దోచుకున్నారు. నన్ను ఈడ్చుకెళ్ళి మంచానికి కట్టేసారు. చంపేస్తానని బెదిరించారు. నన్ను వదిలేయండి లేదా చంపేయమని వారిని బతిమాలాను. వాళ్ళు నన్ను ఏడవద్దంటూ కొట్టారు. చివరికి మా దగ్గరున్న విలువైన వస్తువులు ఇమ్మన్నారు. నా నగలన్నీ ఇచ్చేసాను. అదృష్టవశాత్తూ నన్ను ఏమీ చేయకుండా వదిలేసారు’’ అని మరొక మహిళ చెప్పుకొచ్చింది.
హిందువులపై దాడులు ఎలా చేస్తున్నారు?
బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ సంస్థ సభ్యులు దేశమంతటా హిందువుల ఇళ్ళు, దుకాణాలు, వ్యాపారసంస్థల వివరాలన్నీ ముందే సేకరించారు. షేక్ హసీనా గద్దె దిగిపోయిన వెంటనే వాళ్ళు తమ అరాచకాలు మొదలుపెట్టారు. ముస్లిములు, జమాతే ఇస్లామీ సభ్యులు గుంపులు గుంపులుగా వీధుల్లో తుపాకులతో తిరిగారు. దాంతో హిందువులకు సురక్షిత ప్రాంతాలకు పారిపోవడానికి మార్గమే లేకుండా పోయింది.
ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన అన్న పేరుతో ఇస్లామిస్టులు హిందువుల ఇళ్ళు, దుకాణాలు, గుడులపై దాడులు మొదలుపెట్టారు. హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆందోళనల సాకుతో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీల మీద జరుగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తం చేసారు.
హిందువుల మీద దాడులు, అత్యాచారాల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అక్కడ జరుగుతున్న హింస తీవ్రతను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. బంగ్లాదేశ్ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడం తక్షణావసరం అని వివరిస్తున్నాయి.