ఆన్లైన్ ద్వారా వార్తలు ప్రసారం చేయడంతో పాటు వర్తమాన అంశాల గురించి చర్చించడం, ఇతర అంశాలపై అభిప్రాయాలు వెల్లడించే కంటెంట్ క్రియేటర్లు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి రానున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ప్రసార సేవల(నియంత్రణ) చట్టం ముసాయిదాలో పలు నిబంధనలు ఉన్నాయి. ఈ చట్టం రూపకల్పనకు ముసాయిదాను తయారుచేసి 2023 నవంబరులో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. సోషల్ మీడియా అకౌంట్లు, ఆన్లైన్ వీడియో క్రియేటర్లకు సైతం ఈ చట్టం వర్తింపజేయనుంది.
‘డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్’, ‘వార్తలు, వర్తమాన అంశాల కంటెంట్ ప్రచురణకర్త’ అనే కొత్త క్యాటగిరీని కొత్త ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. వ్యాపారం, వృత్తి, వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా ఆన్లైన్ పత్రిక, వార్తల పోర్టల్, వెబ్సైట్, సోషల్ మీడియా వేదికలు, ఇంకా ఇలాంటి ఇతర మాధ్యమాల ద్వారా వార్తలు, వర్తమాన అంశాలు ప్రసారం చేసే వ్యక్తి లేదా సంస్థను ఇక నుంచి ‘డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్’గా పేర్కొంటారు.
డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్ క్యాటగిరిలో ఉండే వ్యక్తి లేదా సంస్థ తయారుచేసే కంటెంట్ గురించి కేంద్ర ప్రసార శాఖకు సమాచారం అందజేయాల్సి ఉంటుంది. సొంతంగా, తమ ఖర్చులతో కంటెంట్ ఎవాల్యువేషన్ కమిటీ(సీఈసీ)లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
కమిటీలో మహిళలు, శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, విభిన్న సమూహాలపై జ్ఞానం ఉన్న వారిని సభ్యులుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. కమిటీ సభ్యుల పేర్లు కూడా కేంద్రానికి అందజేయాలి . నిబంధనలు పాటించకపోతే మొదటిసారి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. మరోసారి
ఉల్లంఘనలకు పాల్పడితే రూ.2.5 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
ఓటీటీ బ్రాడ్కాస్టర్లు, డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్ల సమాచారం అందజేయకపోతే సోషల్ మీడియా కంపెనీలు బాధ్యులు అవుతాయి. ఈ చట్టం ముసాయిదా దశలోనే ఉందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభ వేదికగా వెల్లడించారు.