ఉత్తరాదిలో భారీ వర్షాలతో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో స్థానికులతో పాటు పుణ్యక్షేత్రాల దర్శనానికి వచ్చిన భక్తులు నానా యాతన పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోనూ పరిస్థితి భయంకరంగా ఉంది. బాధితులను రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినూక్, ఎంఐ 17 హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు.
కేదార్నాథ్ మార్గంలో చిక్కుకుపోయిన 6,980 మందికి పైగా యాత్రీకులను రక్షించారు. ఇంకా 1,500 మందికి పైగా భక్తులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో వీరిలో 150 మంది తమ కుటుంబాలను సంప్రదించలేని స్థితిలో ఉన్నారు.
భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఒక యాత్రికుడు మృతిచెందాడని సోన్‌ప్రయాగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ విశాఖ అశోక్ భదానే చెప్పారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామితో ఫోన్లో మాట్లాడారు . సహాయ చర్యలపై ఆరా తీశారు. శుక్రవారం 599 మందిని విమానంలో, 2,380 మందిని కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
మెరుపు వరదల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో మృతిచెందినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మూడు జిల్లాల్లో 45 మంది ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ శిమ్లా-కుల్లూ సరిహద్దులో పర్యటించి, బాధితులను పరామర్శించారు.