టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు పదవి నుంచి తనను అకారణంగా తొలగించారంటూ రమణ దీక్షితులు వేసిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారని పిటీషన్ లో పేర్కొన్నారు. టీటీడీ ఈవో సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని పిటీషన్ లో తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు,
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
టీటీడీలో వంశపారంపర్యంగా అర్చకులు ఉన్నవారికి అప్పటి టీడీపీ ప్రభుత్వం పదవీ విరమణ విధానాన్ని అమలు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రమణ దీక్షితులు సహా మరి కొందరు అర్చకులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పుచెప్పింది. రమణదీక్షితులు వయోభారంతో స్వామివారి కైంకర్య సేవలు సక్రమంగా నిర్వర్తించలేరంటూ టీటీడీ ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రమణ దీక్షితులు గౌరవ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు రమణ దీక్షితులు టీటీడీ పాలకమండలి, అధికారులు, సీనియర్, జూనియర్ పీఠాధిపతులు, నాటి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నోటీసులు జారీ చేసిన టీటీడీ, ఈ ఏడాది మార్చిలో రమణదీక్షితులను బాధ్యతల నుంచి తొలగించింది. ఈ ఉత్తర్వులను ఆయన కోర్టులో సవాల్ చేశారు.