కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్‌పై ఆ పార్టీ ఆగ్రహం పట్టలేకపోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆయన దిష్టిబొమ్మలు తగులబెట్టింది.
సీతాపూర్‌లో ఒకపక్క వాన కురుస్తుండగానే బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ తగులబెట్టడానికి ప్రయత్నించింది. వారి ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేసారు. ఆ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణపడ్డారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హత్రాస్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు షహీద్ భగత్‌సింగ్ పార్క్‌లో గుమిగూడారు. అనురాగ్ ఠాకూర్ దిష్టిబొమ్మ తగులబెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. హాపూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు అటార్పూర్ కూడలి దగ్గర అదే పనిచేసారు.
మంగళవారం నాడు లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ కులగణన మీద వ్యాఖ్యలు చేసారు. ఎవరి పేరూ ప్రస్తావించకుండానే ‘‘తమ కులం పేరు చెప్పనివారు దేశంలో కులగణన గురించి మాట్లాడుతున్నారు’’ అని అనురాగ్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు సోమవారం నాడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో, బడ్జెట్ హల్వా తయారీ వేడుకలో ఓబీసీలు, ఇతర కులాల వారు ఎవరూ లేరంటూ మండిపడ్డారు. దానికి బీజేపీ నేతలు స్పందించారు. రిజర్వేషన్లను అడ్డుకునే సంఘటనలు కాంగ్రెస్ చరిత్రలో కోకొల్లలు అంటూ పలు ఉదాహరణలను ఉటంకించారు.
అనురాగ్ ఠాకూర్ మంగళవారం నాటి తన ప్రసంగంలో కాంగ్రెస్ కుంభకోణాల గురించి చెప్పుకొచ్చారు. ‘‘రాహుల్జీ, మీరు హల్వా గురించి మాట్లాడారు. బోఫోర్స్ కుంభకోణంలో, అంతరిక్ష్-దేవాస్ స్కాంలో, కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో, నేషనల్ హెరాల్డ్ కేసులో, సబ్‌మెరైన్ వ్యవహారంలో, అగస్టా వెస్ట్‌లాండ్, టూజీ, బొగ్గు, యూరియా, గడ్డి తదితర కుంభకోణాల్లో హల్వా ఎవరు తిన్నారు? రాహుల్జీ ఆ హల్వా తియ్యగా ఉందా, చప్పగా ఉందా? కొంతమంది ఓబీసీల గురించి మాట్లాడతారు. వారికి ఓబీసీ అంటే ‘ఓన్లీ ఫర్ బ్రదరిన్లా కమిషన్‘ మాత్రమే. వారి పార్టీ నిజమైన ఓబీసీల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా?’’ అంటూ మండిపడ్డారు.
‘‘కాంగ్రెస్ యువరాజు మాకు జ్ఞానం బోధించక్కర్లేదు. ఆయన మొదట ఎల్ఓపీ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే లీడర్ ఆఫ్ అప్పోజిషన్ మాత్రమే, లీడర్ ఆఫ్ ప్రాపగాండా కాదు. ఆయన అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలి. ఓబీసీల గురించి, కులగణన గురించి బోలెడంత చర్చ జరిగింది. తన కులమేంటో చెప్పనివారు కులగణన గురించి మాట్లాడతారా?’’ అంటూ తీవ్రంగా స్పందించారు.
కులం గురించి రాహుల్‌గాంధీ అబ్సెషన్
దేశ రాజకీయాల్లో తన గళం వినిపిస్తూనే ఉండేలా చేసుకోడానికి రాహుల్‌గాంధీ వాడుతున్న ముఖ్యమైన పరికరాలు కుల విభజనలు, మతపరమైన అసహనం. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి కొన్నినెలలపాటు కులగణన గురించి, జనాభా దామాషాలో రిజర్వేషన్ల గురించీ మాట్లాడుతూన్నారు. బిహార్‌లో కులగణన చేపట్టిన తరువాత రాహుల్ ఆ అంశం గురించి నిరంతరాయంగా మాట్లాడారు.
గత డిసెంబర్లో కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినం సందర్భంగా నాగపూర్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపడతామని ఊదరగొట్టారు.
ఈ యేడాది మే నెలలో రాహుల్ తన కుల వ్యాఖ్యల తీవ్రత పెంచారు. భారత సైన్యం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాయ్‌బరేలీలో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ అగ్నివీర్ పథకాన్ని విమర్శించారు. ఆ క్రమంలో భారత సైన్యంలో అగ్రవర్ణాల జవాన్లకు, నిమ్నకులాల జవాన్లకూ మధ్య తేడాలున్నాయంటూ దుర్మార్గంగా మాట్లాడారు.
ఏప్రిల్ నెలలో రాహుల్ ఒక ప్రచారసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపడుతుందనీ, ఏయే కులస్తుల దగ్గర ఎంతెంత సంపద పోగుపడిందో కూడా లెక్కతేలుస్తామనీ అన్నారు. కులగణన చేయకుండా తమను ఏ శక్తీ ఆపలేదంటూ ప్రగల్భాలు పలికారు.
మరో సందర్భంలో ఒక మీడియా సమావేశంలో ఒక పాత్రికేయుడితో ఘర్షణ పడిన రాహుల్, ఆ పాత్రికేయుడి కులం, అతని సంస్థ యజమాని కులం ఏమిటంటూ నిలదీసారు. అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పాత్రికేయుణ్ణి చుట్టుముట్టి దాడి చేసారు.
నిజానికి గత కొద్దినెలలుగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ నోటినుంచి కులం గురించిన ప్రస్తావన లేకుండా ఒక్క మాట కూడా రావడం లేదు. ప్రధానమంత్రిని నకిలీ ఓబీసీ అని అవమానించారు. విమాన ప్రయాణికుల కుల వివరాలు సేకరించాలని డిమాండ్ చేసారు. మొత్తం మీద భారతీయులను కులాలుగా విభజించాలన్న విపరీత ధోరణి రాహుల్ ప్రవర్తనలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంది.