యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) చైర్‌పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యురాలిగా ఆమె ఉన్నారు. ఇటీవల చైర్మన్ మనోజ్ సోని పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రీతి సుదన్ 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్. ఏపీ క్యాడర్‌కు చెందిన ప్రీతి సుదన్ , 2020 జూలైలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబూషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా, మహిళా, శిశు అభివృద్ధి, రక్షణ శాఖల్లో కార్యదర్శిగా సేవలందించారు.
ఆర్థికశాస్త్రంలో ఎంఫిల్ పట్టా పొందారు. విదేశాల్లోనూ ఉన్నత విద్య అభ్యసించారు. సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో పీజీ చేశారు. బేటీ బచావో, బేటీ పడావోతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. నేషనల్ మెడికల్ కమిషన్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కమిషన్, ఈ-సిగరెట్ల నిషేధంపై చట్టాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు.