పాలస్తీనా సైనిక సంస్థ హమాస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌పై దాడి చేసి మధ్యప్రాచ్యంలో యుద్ధానికి దారితీసిన హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో ఛైర్మన్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన దాడిలో ఇస్మాయిల్ హనియే, అతని అంగరక్షకుల్లో ఒకరు మరణించారు. ఆ విషయాన్ని హమాస్ ధ్రువీకరించింది.
ఇవాళ ఉదయం జరిగిన దాడిలో ఇస్మాయిల్ హనియే ప్రాణాలు కోల్పోయాడని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. హనియే మంగళవారం నాడు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ మూవ్మెంట్ ప్రధాన కార్యదర్శి జియాద్ అల్ నఖాలాతో కలిసి ఇరాన్ అధినేత సయ్యద్ అలీ హొసేనీ ఖమేనీతో సమావేశమయ్యాడు. ఇజ్రాయెల్‌పై యుద్ధం గురించే వారు చర్చించి ఉంటారని సమాచారం.
ఏప్రిల్ నెలలో హనియే ముగ్గురు కుమారులూ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో అమీర్ హనియే హమాస్ మిలటరీ విభాగంలో సెల్ కమాండర్‌గా ఉండేవాడు. మిగతా ఇద్దరూ మొహమ్మద్ హనియే, హాజెమ్ హనియే కూడా హమాస్ మిలటరీలోనే పనిచేసేవారు. హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హమాస్ ప్రకటించింది. అయితే, హనియే హత్య గురించి ఇజ్రాయెల్ ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు.
మరోవైపు, హెజ్బొల్లా సీనియర్ మిలటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను తాము హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఇజ్రాయెల్ మీద హెజ్బొల్లా దాడులకు నేతృత్వం వహించింది అతనే. కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్ ఉత్తరభాగంలోని మజ్దల్ షామ్స్‌లో 12మంది పిల్లలను హతమార్చింది ఫాద్ షుక్రేనని ఐడిఎఫ్ వెల్లడించింది.