ఇవాళ ఉదయం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్‌ను ఆపు చేసేసారంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణను కేంద్రప్రభుత్వం పరిశీలించింది. ఆమె ఆరోపణ వాస్తవదూరమనీ, తప్పుదోవ పట్టించేలా ఉందనీ తేల్చింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్ మమతా బెనర్జీ ఆరోపణలను కొట్టిపడేసింది. ‘‘ఆమె మాట్లాడే సమయం అయిపోయిందని మాత్రమే గడియారం సూచించింది’’ అని వివరించింది.
‘‘నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మైక్ స్విచాఫ్ అయినట్లు వెల్లడించారు. ఆ సమాచారం తప్పుదోవ పట్టించేదిలా ఉంది. ఆమె మాట్లాడే సమయం అయిపోయిందని మాత్రమే గడియారం సూచించింది. నిజానికి గంట కూడా మోగలేదు’’ అని పిఐబి ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది.
ఇదే వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. మమత ఆరోపణ పూర్తిగా అబద్ధమని చరెప్పారు. ప్రతీ ముఖ్యమంత్రికీ మాట్లాడడానికి ఎవరి సమయం వారికి కేటాయించామని చెప్పారు.
‘‘నీతి ఆయోగ్ సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు. ప్రతీ ముఖ్యమంత్రికీ కొంత సమయం కేటాయించారు. ఆ సమయం ప్రతీ టేబుల్ మీదా ఉన్న తెర మీద కనిపించేలా ఏర్పాటు చేసారు. ఆమె తన మైక్ స్విచాఫ్ చేసేసారని మీడియాకు చెప్పారు. అది పూర్తిగా తప్పు. నిజం కాదు. ఆవిడ నిజమే మాట్లాడి ఉండాల్సింది. ఒక అబద్ధం చెప్పి దాని ఆధారంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదు’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, సమావేశంలో వక్తలకు వారి పేర్ల మొదటి అక్షరాల వరుసక్రమంలో మాట్లాడే అవకాశం వస్తుంది. అయితే తాను త్వరగా వెళ్ళిపోవలసి ఉందని మమతా బెనర్జీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో ఆమెకు ఏడవ వక్తగా అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని పిఐబి మరో ట్వీట్ ద్వారా వెల్లడించింది.
ఈ ఉదయం నీతి ఆయోగ్ సమావేశం నుంచి బైటకు వచ్చిన మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ తనపై రాజకీయ వివక్ష చూపించారని ఆరోపించారు. తనకు ఐదు నిమిషాల కంటె ఎక్కువ సమయం మాట్లాడడానికి ఇవ్వలేదని, మిగతా ముఖ్యమంత్రులకు ఎక్కువ సమయం ఇచ్చారనీ ఆరోపించారు.