ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ లో స్థానికులతో పాటు యాత్రీకులు నానా అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వచ్చిన భక్తులు కూడా వరదల్లో చిక్కుకుపోయారు.
రుద్రప్రయాగ్ జిల్లాలోని మద్మహేశ్వర్ ఆలయం సమీపంలో సుమారు 50 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రెస్క్యూ టీమ్ యాత్రికులను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.