అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. బోయింగ్ వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ .. స్పేస్ స్టేషన్‌లోనే మరికొన్ని రోజులు గడపాల్సి వస్తోంది. అంతరిక్ష కేంద్రం నుంచి జూన్ మధ్యలోనే తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ వ్యోమనౌకలో థ్రస్టర్ ఫెయిల్యూర్‌తో అక్కడే ఉండిపోయారు. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో.. హీలియం వాయువు కూడా లీకవుతున్నట్లు కూడా గుర్తించారు.
వ్యోమగాములు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదని, ఇంకా ఆ తేదీ నిర్ణయించలేదని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ వెల్లడించారు. స్టార్‌లైనర్‌లోనే విల్మోర్, విలియమ్స్‌ను తీసుకురావడం తమ లక్ష్యమన్నారు. బ్యాకప్ ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపిన స్టిచ్, స్పేస్ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా కూడా వ్యోమగాములను వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. స్టార్‌లైనర్‌లో ఉన్న అయిదు థ్రస్టర్లు విఫలం అయ్యాయని నాలుగింటిని రీయాక్టివేట్ చేసినట్లు నాసా పేర్కొంది.