ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీ వేదికగా మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం హయాంలో మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని వెల్లడించారు. విచారణ అనంతరం అవసరమైతే ఈ విషయంపై ఈడీ విచారణకు కూడా ఆదేశిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లడంతో పాటు అక్రమ సంపాదన అంతా వైసీపీ నేతల జేబులోకి వెళ్లిందన్నారు.
2019-24 మధ్య వైసీపీ జరిగిన పాలన ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుందన్న చంద్రబాబు, గత ఐదేళ్లలో డబ్బుల ఉన్మాదంతో విధ్వంస చేశారన్నారు.
రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత ప్రజలను మోసం చేశారని చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ లో దొరకకుండా చేశారన్నారు. ప్రజలకు ఇష్టంలేని బ్రాండ్లను దుకాణాల్లో ఉంచారన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఆదాయం పెరిగినప్పటికీ ఏపీ తగ్గిపోయిందన్నారు. మద్యం వినియోగం అమాంతం పెరిగిపోయినా, ఆదాయం పెరగలేదన్నారు. తగ్గిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.
పేదవాడి మద్యం బలహీనతను ఆసరాగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా 5 టాప్ బ్రాండ్ల కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారన్నారు.