ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించారని మండిపడ్డారు. అరాచక, అటవిక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో దిల్లీ వేదికగా జగన్ నిరసన వ్యక్తం చేశారు. ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరిగిన హత్యలను ఇతర పార్టీల నేతలకు వివరించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 మందికి పైగా హత్యకు గురయ్యారన్నారు. 300 మందిపై హత్యాయత్నాలు జరిగడంతో పాటు 560 చోట్లకు పైగా ప్రైవేటు ఆస్తులు, 490 చోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినట్లు వివరించారు. తోటలు కూడా విధ్వంసం చేస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడైనా మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ పేరిట హోర్డింగ్‌లు పెట్టారన్నారు. టీడీపీ వాళ్లు దాడులు, ఆస్తుల విధ్వంసం చేసినా.. ఏ చర్యా తీసుకోవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రెడ్‌బుక్ రాజ్యాంగం పని చేస్తోందన్నారు. వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లదాడి జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో జాతీయ మీడియా అండగా నిలవాలని కోరారు.
వైసీపీ చేపట్టిన నిరసనకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలని సూచించిన అఖిలేశ్ యాదవ్, అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలుపెట్టినట్లు ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థం అవుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చేష్టలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్, లోక్ సభ నేత అరవింద్ మాట్లాడుతూ వైయస్ జగన్‌కు తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు.రాజకీయ కక్ష సాధింపు చర్యలు దేశానికే మంచిది కాదన్నారు.
వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ప్రతినిధులు అబ్దుల్ వాహబ్, హ్యారిస్ పాల్గొని మద్దతు తెలిపారు.
ఏపీలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాల్సిన బాధ్యత దేశ ప్రధాని, రాష్ట్ర పతికి, మీడియాకు ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు రావడం ఖాయమన్నారు.