ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశాలను ఆయన ప్రారంభించారు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చరిత్ర, 2014లో రాష్ట్ర విభజన, అనంతర పరిణామాలు, 2014లో చంద్రబాబునాయుడు, 2019లో వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాల పాలన గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారన్న గవర్నర్, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన బాధ్యత కొత్త శాసనసభ సభ్యులమీద ఉందన్నారు.
గవర్నర్ తన ప్రసంగంలో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దార్శనికుడిగా అభివర్ణించారు. ఆయన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీస్థాయిలో వచ్చాయని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సిపి పాలనలో రాష్ట్రం వెనుకంజ వేసిందన్నారు. గత ప్రభుత్వ అరాచక పాలన కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనీ, అందువల్ల ప్రజల ఆకాంక్షలను తక్షణమే నెరవేర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదనీ వెల్లడించారు. అందువల్ల అర్ధవంతమైన చర్చల తర్వాతే బడ్జెట్‌కు వెళ్ళాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని వివరించారు.
గవర్నర్ ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు బడ్జెట్ సమావేశాల తేదీలను, కార్యాచరణను బీఏసీ ఇవాళ ఖరారు చేస్తుంది.
వైఎస్ఆర్సిపి వాకౌట్
జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు నల్ల కండువాలు, ప్లకార్డులు ధరించి వచ్చారు. వారిని ప్లకార్డులతో లోపలికి వెళ్ళడానికి పోలీసులు అనుమతించలేదు. ప్లకార్డులు లాక్కుని చించేసారు. దాంతో పోలీసులకు, వైఎస్ఆర్సిపి సభ్యులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆ పార్టీ ప్రతినిధులు నల్ల కండువాలతో సభలోకి వెళ్ళారు.
గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష ప్రతినిధులు నినాదాలు చేసారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. హత్యా రాజకీయాలు నశించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అంటూ నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ నుంచి వాకౌట్ చేసారు.