ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. నడకమార్గంలో ఆదివారం ఉదయం కొండలపై నుంచి పడిన రాళ్ళు దొర్లిపడటంతో ముగ్గురు యాత్రికులు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధితులంతా మహారాష్ట్రకు చెందిన వారు.
ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టినట్లు విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపారు. చిర్బాసా సమీపంలోని కొండపై నుంచి భారీ రాళ్ళు పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు వివరించారు.