ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్ల పద్ధతిని సంస్కరించాలంటూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో మృతుల సంఖ్య 105కు పెరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూ విధించింది. ఘర్షణలను పోలీసులు నియంత్రించలేకపోతుండడంతో మిలటరీ బలగాలను రంగంలోకి దింపింది.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధుల ఆందోళనలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరస్పర ఘర్షణల్లో కనీసం 105మంది చనిపోయారు. 15ఏళ్ళుగా అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వానికి ఇది పెద్ద సవాల్‌గా నిలిచింది. సుమారు మూడు వారాలుగా జరుగుతున్న ఘర్షణలు ఈ సోమవారం నుంచి తీవ్రరూపం దాల్చాయి, హింసాత్మకంగా మారాయి.
రాజధాని ఢాకాలో బహిరంగంగా ప్రజలు గుమిగూడడాన్ని, సమావేశమవడాన్నీ నిషేధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేసారు. ఆందోళనలు మొదలయ్యాక ఇటువంటి నిషేధం ప్రకటించడం ఇదే మొదటిసారి. ‘‘ప్రజాభద్రత కోసమే ఢాకాలో అన్నిరకాల ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలను నిషేధించాం’’ అని పోలీస్ విభాగం అధికారి హబీబుర్ రెహమాన్ తెలియజేసారు. ఇప్పటికే దేశంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేసారు.
అయినప్పటికీ పోలీసులు, విద్యార్ధుల మధ్య ఘర్షణలు ఆగలేదు. తమ ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్ధి సంఘాల నాయకులు చెబుతున్నారు. సామాన్య ప్రజల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపిస్తూ, షేక్ హసీనా తక్షణం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నర్సింగ్డి జిల్లాలో ఆందోళనకారులు జైల్లోకి చొరబడి అక్కడి ఖైదీలను విడిపించారు. ఆ తర్వాత జైలుకు నిప్పుపెట్టారు. వందల సంఖ్యలో ఖైదీలు జైలునుంచి పారిపోయారని పోలీసులు చెబుతున్నారు.
ఆందోళనకారులపై దాడులు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుపట్టింది. యుఎన్ మానవహక్కుల సంస్థ అధినేత వోకర్ టర్క్ అటువంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. వాటి విషయమై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని, బాధ్యులను శిక్షించాలనీ కోరారు.
ఈ ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో చదువుకుంటున్న 300కు పైగా భారతీయ విద్యార్ధులు స్వదేశానికి చేరుకున్నారు. వారిలో అత్యధికులు వైద్యవిద్య చదువుతున్న వారే. ఉత్తరప్రదేశ్, హర్యానా, మేఘాలయ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల నుంచి వెళ్ళినవారే. త్రిపురలోని అఖురా, మేఘాలయలోని డాకీ ల్యాండ్పోర్ట్ల ద్వారా స్వదేశానికి చేరుకున్నారు. మరికొందరు విద్యార్ధులు భూటాన్, నేపాల్ మీదుగా భారత్ చేరుకున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు