బంగ్లాదేశ్‌లో విద్యార్ధులు చేపట్టిన ఆందోళన హింసాయుతంగా మారింది. ఆ ఘర్షణల్లో ఇప్పటికే 32మంది మరణించారు. ప్రజలు సంయమనం పాటించాలనీ, ఘర్షణలకు పాల్పడవద్దనీ ప్రధానమంత్రి షేక్ హసీనా బుధవారం జాతీయ టెలివిజన్ ‘బి టివి’ ద్వారా విజ్ఞప్తి చేసారు. అయితే, గురువారం నాడు బి టివి కార్యాలయానికి విద్యార్ధులు నిప్పు పెట్టారు.
బంగ్లాదేశ్‌లో సివిల్ సర్వీస్ నియామకాల నిబంధనలను సంస్కరించాలని కోరుతూ వందలమంది ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వారిపైకి పోలీసులు రబ్బర్ బులెట్లతో కాల్పులు జరిపారు. దాంతో ఆగ్రహానికి లోనైన ఆందోళనకారులు ఢాకాలోని బి టివి ప్రధాన కార్యాలయం భవనాన్ని తగులబెట్టేసారు. బిల్డింగ్ బైట పార్క్ చేసిన వాహనాలకు కూడా నిప్పుపెట్టారు.
భవనానికి నిప్పు పెట్టడంతో లోపల చాలామంది చిక్కుకుపోయారు. వారందరినీ అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా తరలించారు. ఆ విషయాన్ని బి టివి అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతానికి బి టివి ప్రసారాలు నిలిచిపోయాయి.
ఆందోళనల నేపథ్యంలో పాఠశాలలను, విశ్వవిద్యాలయాలనూ మూసివేయాలని షేక్ హసీనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో శాంతిభద్రతల పరిస్థితులు చక్కబడేంతవరకూ వాటిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
పోలీసుల కాల్పుల్లో గురువారం ఒక్కరోజే 25మంది మరణించారు. దానికి ముందు వారం రోజుల వ్యవధిలో ఏడుగురు మరణించారు. ఇంకా వందలాదిమంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
షేక్ హసీనా నిరంకుశ పాలనను వ్యతిరేకించే పేరిట ఆందోళనకారులు ఈ నిరసనలు ప్రారంభించారు. ఆమె పాలనలో దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతోందని మండిపడుతున్నారు.