కాన్పూర్ నగరంలో గంగానది ప్రక్షాళన కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర పరిశ్రమకు నిదర్శనంగా నిలిచింది. నమామి గంగే ప్రాజెక్ట్ ద్వారా ఆ నగరంలోని గంగానదిని కాలుష్యాల నుంచి రక్షించారు. ఒకప్పుడు చూడడానికి కూడా చిరాకువేసే గంగానది ఇప్పుడు స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా తయారైంది.
కాన్పూర్ నగరంలో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలూ కలిపి రోజుకు 40కోట్ల లీటర్లు (400ఎంఎల్డి) విడుదల అవుతాయి. అవన్నీ గంగానదిలోనే కలుస్తుండేవి. దానికోసం ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ పేరిట బహుముఖవ్యూహంతో ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగా నగరంలోని డ్రైనేజీలను అప్‌గ్రేడ్ చేయడం, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (సిఇటిపి), సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (ఎస్టిపి) నిర్మించడం, నదీ ఘాట్లను అభివృద్ధి చేయడం వంటి పనులు చేపట్టారు.
గంగానదిలోకి మురుగునీటిని మోసుకెళ్ళే సిసామౌ నాలా వంటి డ్రైనేజీలను సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మళ్ళించారు. తద్వారా గంగలో కలిసే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం కాన్పూర్‌లో 487 ఎంఎల్డి ట్రీట్మెంట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. బింగావాలో 210 ఎంఎల్డి ఎస్‌టిపిలు, జాజ్‌మౌలో 205 ఎంఎల్డి ఎస్‌టిపిలు, సజారీలో 42 ఎంఎల్డి ఎస్‌టిపిలు, పంఖాలో 30 ఎంఎల్డి ఎస్‌టిపిలు పనిచేస్తున్నాయి. ఉన్నావ్‌లో 15 ఎంఎల్డి ఎస్‌టిపిలు, బిథూర్‌లో 2 ఎంఎల్డి ఎస్‌టిపిలు నిర్మించారు. శుక్లాగంజ్‌లో 5 ఎంఎల్‌డిల ఎస్టిపి నిర్మాణం 75శాతం పూర్తయింది. మరో మూడునాలుగు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తయి, ప్లాంట్ నిర్వహణలోకి వస్తుంది.
కాన్పూర్ వాసులు నగరంలో గతంలోని పరిస్థితికి, ప్రస్తుత పరిస్థితికీ మధ్య గణనీయమైన తేడా ఉందని చెబుతున్నారు. పదేళ్ళ క్రితంతో పోల్చుకుంటే నగరంలో పర్యావరణం చాలా స్వచ్ఛంగా ఉందనీ, అదంతా నమామి గంగే ప్రాజెక్ట్ విజయమేననీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాన్పూర్‌లో గంగానది కాలుష్యానికి ప్రధాన కారణం తోలు పరిశ్రమలు. వాటినుంచి వెలువడే పారిశ్రామిక వ్యర్థాలను గతంలో నేరుగా నదిలోకి వదిలేసేవారు. ఇప్పుడా వ్యర్థాలను శుద్ధి చేయడానికి జాజ్మౌ వద్ద 20ఎంఎల్డి కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సిఇటిపి) నిర్మించారు. ఉన్నావ్, బంథర్ ఇండస్ట్రియల్ క్లస్టర్లలోని తోలు పరిశ్రమల వ్యర్థాలను ప్రక్షాళన చేసేందుకు అక్కడ సిఇటిపిలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
నమామి గంగే ప్రాజెక్టులో భాగంగా కాన్పూర్, బిథూర్లలో 24 ఘాట్లను, 3 శ్మశానవాటికలను నిర్మించడమో లేక పునర్నిర్మించడమో చేసారు. 2019లోనే గంగా బ్యారేజ్ వద్ద అటల్ ఘాట్ నిర్మాణం పూర్తయింది.
ఇలాంటి మౌలికసదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలతో నమామి గంగే ప్రాజెక్ట్ సరిపెట్టుకోలేదు. తర్వాత వాటి నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టింది. నదీతీర ప్రాంతాలను విహారస్థలాలుగా అభివృద్ధి చేయడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అలాంటి ప్రాంతాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం చేసింది. అంతేకాదు, నదీ ప్రక్షాళన కార్యక్రమాల్లోనూ, అవగాహనా ప్రచారాల్లోనూ స్థానికులను భాగస్వాములను చేయడం మంచి ఫలితాలు సాధించింది.
అటల్ ఘాట్, బ్రహ్మావతార్ ఘాట్, భైరవ ఘాట్, రాణీ లక్ష్మీబాయి ఘాట్ వంటి ఘాట్లకు సందర్శకులు ఇప్పుడు పెద్దసంఖ్యలో వస్తున్నారు. గంగానది స్వచ్ఛతను, పవిత్రతనూ అనుభూతి చెందగలుగుతున్నారు.