భారత్ పై దండెత్తిన దురహంకార మహమ్మదీయులను గడగడలాడించిన ఛత్రపతి శివాజీ పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆయన యుద్ధ సమయాల్లో ఉపయోగించిన ప్రత్యేకమైన ఆయుధం నేడు మళ్ళీ మరాఠనేలకు చేరింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన వాఘ్ నఖ్ ఆయుధం, పులి పంజా ఆకారంలో ఉంటుంది. లోహంతో తయారైన వాఘ్ నఖ్ ను చేతికి ధరించి ఎదుటి వ్యక్తి శరీరాన్ని చీల్చివేసేందుకు ఉపయోగించవచ్చు.
బీజాపూర్ సామ్రాజ్య సేనాధిపతి అఫ్జల్ ఖాన్ ను హతమార్చేందుకు వాఘ్ నఖ్ ను ఉపయోగించినట్లు పలు చరిత్ర పుస్తకాల్లో పేర్కొన్నారు. కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్ కు చేరగా లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో భద్రపరిచారు.
భారతప్రభుత్వ ప్రయత్నం మేరకు వందల ఏళ్ళ తర్వాత ఈ ఆయుధం తిరిగి భారత్ చేరింది. బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో ఈ ఆయుధాన్ని భారత్ కు తీసుకొచ్చారు.
వాఘ్ నఖ్ లండన్ నుంచి ముంబై చేరుకున్నట్టు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ తెలిపారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీనిని ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించారు.