సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కిపంపుతోంది. ఈ చర్యల్లో భాగంగా 104 మంది భారతీయులతో యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం భారత్ లో దిగింది. సరైన గుర్తింపు పత్రాలు లేకుండా వలసదారులుగా ఉంటున్న వారిని విమానంలో భారత్ కు అమెరికా పంపింది. ఆ విమానం అమృత్సర్లో దిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. వారిలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు ఉన్నారు.
గుర్తింపును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత స్వస్థలాలకు చేరుస్తామన్నారు. గడువు ముగిసినా అధికార పత్రాలు లేకుండా తమ భూభాగంలో ఉంటున్న వలసదారుల్ని తిరిగి వాళ్ల దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ట్రంప్ ప్రభుత్వం చేపట్టింది.
అమెరికాలో ఏడున్నర లక్షల మంది భారతీయులు సరైన గుర్తింపు పత్రాలు లేకుండా ఉంటున్నారని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. అమెరికా చర్యను భారత్ గతంలోనే స్వాగతించింది. అమెరికాతో పాటు ప్రపంచంలో ఏక్కడ ఉన్నా తమ వారిని వెనక్కి పిలిపించుకుంటామని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు.
అక్రమవలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా వలసవచ్చిన వారిని గుర్తించి తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు.ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న ఐదువేల వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు అమెరికా సిద్ధమైంది. గటేమాలా,పెరు,హోండూరస్ దేశాల వారిని యుద్ధవిమానాల్లో చేరవేస్తున్నారు.