జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. జమ్ములోని దోడా జిల్లా డెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు తిరుగుతున్నారనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసుల సాయంతో సైనికులు తనిఖీలు చేపట్టారు. సోమవారం రాత్రి గం.9.30 నిమిషాల సమయంలో ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఒక్కసారిగా సైనిక వాహనంపైకి ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఓ సైనిక అధికారి సహా, మొత్తం నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చేపట్టారు.
గతంలో పూంచ్, రాజౌరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉగ్రదాడులు జరిగేవి. కొంత కాలంగా ఉగ్రవాదులు జమ్ము, కశ్మీర్ అన్ని ప్రాంతాల్లోనూ సైనికులపై దాడులకు తెగబడుతున్నారు. గత వారంలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే.
గడచిన 32 నెలల్లో ఉగ్రదాడుల్లో జమ్ము కాశ్మీర్‌లోనే 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్ము కాశ్మీర్‌లో ఇంకా 60 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వారిని మట్టుబెట్టేందుకు సైన్యం నిరంతరం తనిఖీలు చేస్తోంది.