జమ్ముకశ్మీర్‌లోని ఉమా భగవతి దేవి పురాతన ఆలయాన్ని 30 ఏళ్ళ తరువాత తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయాన్ని తెరిచి పునరుద్ధరణ పనులు చేపట్టారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో గల షాంగస్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది.
రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన ఉమాదేవి అమ్మవారి విగ్రహాన్ని వేదమంత్రాలతో గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఆలయ పునరుద్ధరణ చర్యలపై స్థానిక కశ్మీరీ పండిట్లతో పాటు ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. గుల్జార్ అహ్మద్ అనే స్థానికుడు మాట్లాడుతూ పండిట్ సోదరులకు అన్ని విధాలుగా సహాయపడతామని తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆలయంలో పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు.
1990 ప్రాంతంలో ఆలయం ధ్వంసమైనట్లు కశ్మీరిపండిట్లు తెలిపారు. ఆ సమయంలో ఉగ్రదాడులు కారణంగా పండిట్లు వలసపోయారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కశ్మీర్లో ఉగ్రవాదుల అలజడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో తీత్వాల్ వద్దనున్న మాతా శారదా ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. యూటీ అడ్మినిస్ట్రేషన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద ఆలయాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది.