ఇస్లాం మతబోధన కేంద్రాలైన మదరసాల్లో విద్యార్జనకు హిందువులు, ఇతర ముస్లిమేతరులు తమ పిల్లలను పంపించవద్దని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ (ఎన్సిపిసిఆర్) అధ్యక్షుడు ప్రియాంక్ కనూంగూ విజ్ఞప్తి చేసారు. మదరసాల్లో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనీ, పిల్లలను మతం మారుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనీ ఆయన హెచ్చరించారు.
ప్రియాంక్ కనూంగూ ఇవాళ సామాజిక మాధ్యమాల ద్వారా జారీ చేసిన ఒక ప్రకటనలో తన ఆందోళనలు వెలిబుచ్చారు. మదరసాలు ఇస్లామిక్ మతవిద్యను బోధించే కేంద్రాలు. అవి విద్యాహక్కు పరిధిలో లేవు. మదరసాల్లో ముస్లిమేతర విద్యార్ధులను చేర్పించుకోవడం ఆ చిన్నారుల మౌలిక రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, సమాజంలో మతపరమైన విద్వేషాలను వ్యాపింపజేసే కారణం కూడా కాగలదు’’ అని ఆందోళన వ్యక్తం చేసారు.
ఆ సమస్యను నిలువరించడానికి, ప్రస్తుతం మదరసాల్లో చదువుతున్న ముస్లిమేతర విద్యార్ధులకు సాధారణ పాఠశాలల్లో చదువుకునే అవకాశాలు కల్పించాలని ఆయన రాష్ట్రప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఎన్సిపిసిఆర్ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసారని వివరించారు.
ప్రియాంక్ కనూంగూ మరో విషయంపైన కూడా ప్రజలను హెచ్చరించారు. ఇస్లామిక్ సంస్థ జమియాత్-ఎ-ఉలేమా-ఎ-హింద్ సంస్థ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని, ఆ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ చెప్పారు. ‘‘దేవబంద్కు చెందిన దారుల్ ఉలూం అనే ముస్లిం సంస్థ గజ్వా-ఎ-హింద్ (భారతదేశాన్ని ఆక్రమించడం) విధానాన్ని సమర్ధిస్తోంది. వారిపై కమిషన్ గతంలో చర్యలు తీసుకుంది. దాంతో దారుల్ ఉలూమ్ అనుబంధ సంస్థ అయిన జమియాత్-ఉలేమా-ఎ-హింద్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొడుతోంది’’ అని ఆయన హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్లోని దేవబంద్ వద్ద ఒక గ్రామంలో కొన్ని నెలల క్రితం ఒక హిందూబాలుణ్ణి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు, అతనికి సున్తీ కూడా చేసారు. ఆ విషయాన్ని ప్రియాంక్ ఉదాహరిస్తూ హిందూపిల్లలను లక్ష్యం చేసుకుంటున్నారని వివరించారు.
‘‘పిల్లలకు కూడా మతస్వేచ్ఛ ఉంటుంది. దాన్ని ఎవరూ ఉల్లంఘించకూడదు. మతఛాందస సంస్థలు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దంటూ ప్రజలకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లల కోసం మంచి భవిష్యత్తును నిర్మించండి, వారి స్వేచ్ఛను కాలరాయకండి’’ అంటూ, తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ అధ్యక్షుడు స్వయంగా చేసిన ఈ విజ్ఞప్తి, విద్యావాతావరణాన్ని మతమార్పిడి ముఠాలు ఎలా కలుషితం చేస్తున్నాయో, ఎంత ఆందోళనకరంగా మారుస్తున్నాయో తెలియజేస్తోంది. బాలల హక్కులు, వారి స్వేచ్ఛ విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరిస్తోంది.