కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బి నాగేంద్రను ఈ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కేసులో విచారణ కోసం ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుంది.
కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఎస్టీల అభివృద్ధి కోసం మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఆ కార్పొరేషన్లో రూ.88 కోట్ల నిధుల గోల్మాల్ జరిగింది. ఆ కేసులో ఈడీ కొద్దిరోజుల క్రితం 20 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసనగౌడ దద్దాల్, బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే బి నాగేంద్రలకు సంబంధించిన ప్రదేశాల్లో ఆ సోదాలు జరిగాయి. బసనగౌడ వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ కాగా, నాగేంద్ర ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండేవారు. ఆ మంత్రిపదవికి నాగేంద్ర జూన్ 6న రాజీనామా చేసారు.
ఈడీ రెండురోజుల క్రితం నాగేంద్ర వ్యక్తిగత సహాయకుడు హరీష్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటివరకూ 11మందిని అరెస్ట్ చేసింది. రూ.14.5కోట్లు రికవరీ చేసింది.
వాల్మీకి కార్పొరేషన్లో నిధుల గోల్మాల్ వ్యవహారం మే నెలలో బైటపడింది. కార్పొరేషన్లో అకౌంటింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్ మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన సూసైడ్ నోట్లో, కార్పొరేషన్ నిధులను పలు ఖాతాలకు అక్రమంగా బదిలీ చేసినట్లు రాసుకొచ్చారు. మరోవైపు, రూ.88 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐకి ఫిర్యాదు చేసింది.
ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సిబిఐ విచారణ జరుగుతోంది. వాటితో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది.