దేశీయ రక్షణ ఉత్పాదక రంగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16.8శాతం పెరుగుదల నమోదు చేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గణనీయమైన ఆ పెరుగుదల, భారత రక్షణ ఉత్పాదక విలువలో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక వృద్ధి.
‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏ యేడాదికా యేడాది కొంగ్రొత్త మైలురాళ్ళను అధిగమిస్తోంది. 2023-24లో భారత దేశం రక్షణ ఉత్పత్తుల్లో చరిత్రలోనే అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 2023-24లో ఉత్పత్తుల విలువ రూ.1,26,887 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ యేడాది ఉత్పత్తి విలువ 16.8శాతం ఎక్కువగా ఉంది’’ అని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. భారత్‌ను అంతర్జాతీయ రక్షణ రంగ ఉత్పత్తుల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ తెలియజేసారు.
2024-25 నాటికి రక్షణ రంగ ఎగుమతులు 35వేల కోట్లకు చేరాలని, పూర్తి స్వదేశీ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1,75,000 కోట్లు సాధించాలనీ భారత ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.
భారతదేశపు రక్షణ ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.21,083 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది రక్షణ ఎగుమతుల విలువ రూ.15,920 కోట్లతో పోలిస్తే ఏకంగా 32.5శాతం వృద్ధి నమోదయింది. 2013-14తో పోలిస్తే దేశీయ రక్షణ ఎగుమతుల విలువ 31రెట్లు పెరిగింది.
రక్షణమంత్రి ఈ గణాంకాలను ప్రకటించడంతో ఇవాళ (శుక్రవారం) స్టాక్ మార్కెట్లలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ షేర్ల విలువ 1.5శాతం పెరిగి, రూ.5601కి చేరింది. భారతదేశపు రక్షణరంగంలోని పీఎస్‌యూలు కొన్నాళ్ళుగా కొత్త ఆర్డర్లు పెరుగుతుండడంతో లాభాల బాట పడుతున్నాయి. దాంతో వాటి ఈక్విటీల మీద రిటర్నులు గణనీయమైన స్థాయిలో పెరుగుతున్నాయి.