ఝార్ఖండ్ ముక్తి మెర్చా నేత హేమంత్ సోరెన్ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఐదు నెలల క్రితం భూకుంభకోణం కేసులో అరెస్ట్ అయిన హేమంత్, కొద్దిరోజుల క్రితం బెయిల్ మీద విడుదలయ్యారు.
ఈ సాయంత్రం 5గంటలకు రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. హేమంత్ మంత్రివర్గ సభ్యులు ఆదివారం నాడు ప్రమాణం చేయనున్నారు. అసలు హేమంత్ కూడా ఆదివారమే సీఎం బాధ్యతలు చేపడతారని తొలుత భావించారు. అయితే ఇవాళ హడావుడిగా ఆ ప్రక్రియ పూర్తి చేసారు.
కోట్లాది రూపాయల విలువైన భూముల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ యేడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేసింది. అరెస్టుకు కొద్ది నిమిషాల ముందే హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేసారు. అయితే ఆ కేసులో ఆధారాలుగా ప్రవేశపెట్టిన రికార్డులు, కుంభకోణంలో హేమంత్ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు నిరూపించలేకపోయాయని హైకోర్టు భావించింది. దాంతో హేమంత్‌కు బెయిల్ మంజూరు చేసింది.
ఈ ఐదు నెలల పాటు హేమంత్ స్థానంలో ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ వ్యవహరించారు. ఇప్పుడు పదవిని మళ్ళీ హేమంత్‌కు అప్పగించాల్సి వచ్చిందన్న నిరాశను ఆయన దాచుకోలేదు. తనకు అవమానం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. చంపయి సోరెన్‌కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశముంది.