బిహార్లో వంతెనలు వరుసబెట్టి పేకమేడల్లా కూలుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి పోటీపడి మరీ కూలుతున్నాయి. గడిచిన 17 రోజుల్లో 12 వంతెనలు కుప్పకూలాయి.
సరన్ జిల్లా పరిధిలోని గ్రామాలను- సివాన్ జిల్లాను కలుపుతూ గండకి నదిపై నిర్మించిన 15 ఏళ్ళ నాటి వంతెన కూలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
బ్రిడ్జి కూలడానికి కారణాలపై విచారణ జరుపుతున్న అధికారులు, ఈ ప్రాంతంలో ఇటీవల డీసిల్టింగ్ పని జరిగినట్లు తెలిపారు. సరన్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మూడు వంతెనలు కూలినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సిన అన్ని పాత వంతెనలు గుర్తించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్వేకు ఆదేశించిన మరుసటి రోజే ఈ సంఘటన వెలుగుచూసింది. వంతెన నిర్వహణ విధానాలను మెరుగుపరచాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
సివాన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్గంజ్ జిల్లాల్లో బ్రిడ్జీలు కూలాయి. భారీ వర్షాలు, నదీ ప్రవాహం పెరిగిన సమయంలో వంతెనలు కూలుతుండటంతో వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.