అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాల తరవాత ఆగష్ట్ 18న ఏటా ఇండియా టుడే నిర్వహించే పరేడ్లో ఈ ఏడాది అయోధ్యలోని రామాలయ నమూనాకు చోటు దక్కింది. ఆగష్ట్ 18న న్యూయార్క్ నగరంలో ఈ వేడుక జరగనుందని అమెరికా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి అమితాబ్ మిత్తల్ వెల్లడించారు. వేడుకలో ప్రదర్శనకు 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తైన అయోధ్య రామాలయ నమూనాను సిద్దం చేసినట్లు మిత్తల్ తెలిపారు.
అమెరికాలో ఏటా భారత సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఇండియా టుడే పరేడ్ వేడుకను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో ఏటా లక్షన్నర మంది పాల్గొంటున్నారు. అమెరికన్లు, భారతీయుల మధ్య సామరస్యం పెంపొందించడానికి ఈ వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. న్యూయార్క్ నగరం ఈస్ట్ వీధి 38 నుంచి మొదలై 27వ వీధి వరకు ఇండియా టుడే పరేడ్ జరగనుంది.