మణిపుర్ లో అల్లర్లపై పార్లమెంట్లో చర్చించాలంటూ విపక్షాలు చేస్తోన్న ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. మణిపుర్ లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న మోదీ, దీనిపై రాజకీయాలు చేయొద్దంటూ విపక్షాలకు చురకలు అంటించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ప్రధాని మోదీ, రాజ్యసభ వేదికగా సమాధానమిచ్చారు. మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్పేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అక్కడ జరిగిన అల్లర్లపై ఇప్పటివరకు 11 వేల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇప్పుడిప్పుడే హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు మళ్లీ తెరుచుకుంటున్నట్లు వివరించారు. కేంద్ర మంత్రి కొన్ని వారాల పాటు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారన్నారు. వరదలు తలెత్తగా.. సహాయం నిమిత్తం రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని మోదీ వెల్లడించారు.
కాంగ్రెస్ హయాంలో మణిపుర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తుచేసిన మోదీ, ఈ అంశంపై రాజకీయాలు చేయడం విపక్షాలు ఆపాలని అన్నారు.