టీ 20 గెలిచిన సంబరాలు జరుపుకుంటున్న వేళ భారత క్రికెట్ జట్టు భీకర తుపాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయంలో చిక్కుపోయింది. బెరిల్ హరికేన్ విరుచుకుపడటంతో విమానాశ్రయం మూసివేశారు. దీంతో వారు హోటల్‌కే పరిమితం అయ్యారు. మరోవైపు బార్బడోస్‌లో కర్ఫ్యూ విధించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భీకర తుపాను విరుచుకుపడటంతో పెనుగాలులు, అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే బార్భడోస్ సమీప విమానాశ్రయాలను కూడా మూసివేశారు.
భారత జట్టు స్వదేశంలో అడుగుపెట్టగానే వారికి స్వాగతం పలికేందుకు అభిమానులు సిద్దం అయ్యారు. 17 సంవత్సరాల తరవాత టీ20 కప్ గెలుచుకోవడంతో అభిమానులు భారీ ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ భారత జట్టు మాత్రం సొంతగడ్డపై అడుగుపెట్టలేకపోయింది.
త్వరలో ఐదు టీ20ల సిరీస్ జింబాబ్వేతో త్వరలో జరగనుంది. ఇప్పటికే టీంను ఎంపిక చేశారు. వీరిలో రింకూసింగ్, ఖలీల్ అహ్మద్, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ బార్బడోస్‌లో చిక్కుపోయారు. వారు సకాలంలో రాలేకపోతే కొత్త వారిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.