1994నాటి ఇస్రో గూఢచర్యం కేసులో రోదసీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను ఇరికించిన వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఐదుగురు వ్యక్తుల మీద ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ విషయాన్ని బుధవారం వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2021లో నమోదు చేసిన కేసులో ఈ ఛార్జిషీట్ ఇప్పుడు దాఖలైంది. అయితే ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరన్న విషయాన్ని సిబిఐ గోప్యంగా ఉంచింది.
ఇస్రోలో గూఢచర్యం చేసి ఆ సంస్థ రహస్యాలను విదేశాలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో నంబి నారాయణన్‌ను కేరళ పోలీసులు 1994లో అరెస్ట్ చేసారు. అయితే ఆ కేసులో ఆయన ప్రమేయం లేదని నిర్ధారణ అయింది. దాంతో నంబి నారాయణన్ మీద పోలీసులు తప్పుడు కేసు పెట్టిన సంఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు జరిపించి ఆ నివేదికను సిబిఐకి సమర్పించాలని సుప్రీంకోర్టు 2021 ఏప్రిల్ 15న ఆదేశించింది.
1994 అక్టోబర్‌లో కేరళ పోలీసులు మాల్దీవుల దేశానికి చెందిన రషీదా అనే మహిళను తిరువనంతపురంలో అరెస్ట్ చేసారు. ఇస్రో రాకెట్ ఇంజన్లకు సంబంధించిన రహస్య డ్రాయింగ్లను పాకిస్తాన్‌కు అమ్మివేయడం కోసం సేకరించిందన్నది ఆమెపై మోపిన ఆరోపణ. మాల్దీవ్స్‌కు చెందిన, రషీదా స్నేహితురాలైన ఫౌజియా హసన్ అనే మహిళను కూడా అరెస్ట్ చేసారు.
ఆ సమయంలో ఇస్రో క్రయోజెనిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నంబి నారాయణన్, ఇస్రో డిప్యూటీ డైరెక్టర్‌గా డి శశికుమారన్ ఉండేవారు. వారిద్దరినీ కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేసారు. ఇస్రో రహస్యాలను బైటివారికి విక్రయించారన్నది వారిపై మోపిన ఆరోపణ.
సిబిఐ దర్యాప్తులో ఇస్రో శాస్త్రవేత్తలపై చేసిన ఆరోపణలు తప్పుడువని తేలింది. ఆ కేసు సందర్భంగా శాస్త్రవేత్తలపై పోలీసుల చర్యలను సుప్రీంకోర్టు ‘సైకోపేథలాజికల్ ట్రీట్మెంట్’ అని వ్యాఖ్యానించింది. 2018 సెప్టెంబర్‌లో కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేరళ పోలీసుల చర్యలను తీవ్రంగా తప్పుపట్టింది. నంబి నారాయణన్ స్వేచ్ఛకు, గౌరవానికీ, ఆయన మానవ హక్కులకూ తీవ్రభంగం వాటిల్లజేసారని మండిపడింది.