“Essentials of Hindutva” పేరుతో ప్రముఖ స్వాతంత్ర్యవీరుడు వినాయక దామోదర సావర్కర్ వ్రాసిన చిన్న పుస్తకం ఒక అద్భుతమైన రచన. ఆయన గాక మరొకరు ఎవరూ వ్రాయలేని గ్రంథం. ఆయన అందులో మనకు అందించిన అంశాలను ఎలా కూర్చుకొని, ఎలా పేర్చి మనకు అందించాడన్నది మరొక అద్భుతమైన విషయం. ఆ వ్యక్తిత్వం అద్భుతం, ఆ రచన అద్భుతం, ఆ కూర్పు అద్భుతం.
మహారాష్ట్రలోని కొంకణ తీరంలో పెరిగిన సావర్కర్ చిన్నవయస్సులోనే తోటివారిని జతకలుపుకొని ఎన్నెన్నో కార్యకలాపాలు సాగిస్తూ ఉండేవాడు. రచనలు చేస్తూ ఉండేవాడు. (అవన్నీ ఇక్కడ చెప్పటం లేదు. వాటిని తెలుసుకొనటం కోసం ఆయన జీవిత చరిత్ర గ్రంథాన్ని చూడండి) ఆ తర్వాత బారిష్టర్ పట్టా పొందటం కోసమని లండన్‌కి చేరుకొన్నాడు. ఇండియాహౌస్‌లో మకాం. గ్రంథాలయానికి వెళ్ళి గ్రంథాలను, ఆంగ్లేయుల రికార్డులను (ఉత్తర ప్రత్యుత్తరాలను) క్షుణ్ణంగా పరిశీలించి 1857 The First War of Independence గ్రంథం రచించాడు. అయితే ముద్రింపబడకముందే నిషేధింపబడింది ఆ గ్రంథం. మదన్‌లాల్ ఢీంగ్రా వంటి యువకిశోరాలను ప్రేరేపించి దేశమాత సేవలో అతిచిన్నవయసులో బలిదానం కావటం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపినప్పుడు యావత్ప్రపంచం నివ్వెరపోయింది. ఆ తర్వాత లండన్లో అరెస్టు చేయబడిన సావర్కర్ హిందూదేశానికి తీసుకొని రాబడినాడు. విచారణ తంతు తర్వాత రెండు యావజ్జీవ కారాగారవాస శిక్షలు (25+25 = మొత్తం 50 సం||లు) విధింపబడి అండమాన్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌లోని సెల్యులర్ జెయిల్‌కి తరలింపబడి ఒక దశాబ్దంపాటు అత్యంత దుర్భరమూ, కఠినమైన జీవనం గడిపిన వాడాయన.
వీటిని ఇక్కడ ప్రస్తావించడం ఎందుకంటే – ఈ గ్రంథం 1923లో మొదటిసారి ప్రచురించబడింది. అప్పటికి ఆయన పోర్ట్ బ్లెయిర్‌నుండి రత్నగిరికి తరలింపబడినాడు. గ్రంథానికి తుదిరూపం రత్నగిరిలో లభించినా అండమాన్‌లోని సెల్యులర్ జెయిల్‌లోనే ఆయన మనస్సులో దీనికి ఒక రూపం ఇచ్చి ఉంటారు. ఒక చురుకైన విద్యార్థిగా తాను పాఠశాలలో, కళాశాలలో చదివిన విషయాలు – వాటిలోని అసమగ్రత, లండన్‌లో న్యాయశాస్త్రం చదువుతూ పాశ్చాత్య ప్రపంచంలో జాతి గురించి ఉన్న కల్పనలు గ్రహించటం, వేర్వేరు దేశాలకు చెందినవారితో కలిసి సంభాషించటం ద్వారా జాతీయత గురించిన కల్పనలోని లోతులు గ్రహించటము, అండమాన్‌లోని జైలుజీవిత సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకొని రాబడిన ఖైదీలను పరిశీలించటం, వారితో సంభాషించటం ద్వారా హిందూదేశంలో ప్రజల మధ్య వైవిధ్యాలను అవగతం చేసుకోవటం – ఈ నేపథ్యంలోంచి వినాయక దామోదర సావర్కర్ ఈ గ్రంథాన్ని రచించారు.
(వినాయక దామోదర సావర్కర్ రచన ‘ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ’కు బొమ్మరాజు సారంగపాణి అనువాదం ‘హిందుత్వం’ 26 జూన్ 2024న విడుదలైంది. ఆ పుస్తకానికి ‘జాగృతి’ పూర్వ సంపాదకులు వడ్డి విజయసారథి రాసిన మున్నుడిలోని భాగం)