ప్రముఖ టెక్ కంపెనీ ఫాక్స్‌కాన్, వివాహిత మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదని, ఇప్పటికే తీసుకున్న వారిని తొలగిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై కేంద్రం నివేదిక కోరింది. 1976 కార్మిక చట్టం ప్రకారం నియామకాల్లో లింగ వివక్ష చూపడం నేరం. ఫాక్స్‌కాన్ కంపెనీలో గడచిన మూడేళ్లలో వివాహిత మహిళలను తొలగించారని ఫిర్యాదు అందింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది.
ఆపిల్ కంపెనీకి మొబైల్స్ తయారు చేస్తోన్న ఫాక్స్‌కాన్, అసెంబ్లింగ్ యూనిట్లలో ఉత్పత్తి తగ్గుతోందని వివాహిత మహిళలను తొలగించినట్లు రాయిటర్ ప్రముఖంగా ప్రచురించింది. దీనిపై కార్మిక శాఖను కేంద్రం నివేదిక కోరింది. 2022, 23 సంవత్సరాల్లో ఫాక్స్‌కాన్ కంపెనీ హెచ్‌ఆర్ ఫాలసీలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తమిళనాడు ప్రభుత్వానికి తెలిపారు. తమిళనాడులోని ఫాక్స్‌కాన్ కంపెనీలో వివాహిత మహిళలను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వివాహం కాని మహిళలతో పోల్చుకుంటే వివాహం చేసుకున్న మహిళలకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, అది కంపెనీ ఉత్పత్తులపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కార్మిక శాఖ కమిషనర్ నివేదిక తరవాత చర్యలు తీసుకునే అవకాశముంది. కార్మికులు, ఉద్యోగుల నియామకాల్లో వివక్ష చూపడం చట్టరీత్యా నేరం అవుతుంది. మొత్తం ఉద్యోగుల్లో మహిళల నియామకాలపై కూడా కేంద్ర దృష్టి సారించింది.