ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారాన్ని విజయవంతంగా చేయగలిగారు. భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందంటూ వారు ప్రచారం చేసారు. రాహుల్ తన ఎన్నికల ప్రచార సభల్లో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని ప్రజలకు చూపిస్తూ ఆ ఆరోపణలు చేసేవారు. నిజానికి అవి కేవలం పచ్చి అబద్ధాలు మాత్రమే కావు, సాధారణ తర్కాన్నీ, చారిత్రక సత్యాలనూ అపహాస్యం చేసిన వ్యాఖ్యలు. రాహుల్ ఆరోపణలు వినగానే మనకు కలిగే మొదటి ప్రశ్న ‘రాజ్యాంగాన్ని మార్చేయడం’ అంటే అసలు అర్ధమేమిటి? ఇవాళ మనకున్న రాజ్యాంగం దాని అసలైన, ఏ మార్పులూ లేని రూపంలో లేదు.
ఇప్పటివరకూ భారత రాజ్యాంగానికి వందకు పైగా సవరణలు చేసారు. వాటిలో అత్యధికం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసినవే. కాంగ్రెస్ లేదా ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని 78సార్లు సవరించారు లేక మార్చారు. వాటిలో 55 సవరణలు నెహ్రూ-గాంధీ కుటుంబం చేసిన సవరణలే. జవాహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 17సార్లు రాజ్యాంగాన్ని సవరించారు లేక మార్చారు. ఇందిరా గాంధీ హయాంలో ఏకంగా 28 సార్లు సవరించారు. రాజీవ్ గాంధీ పాలనా కాలంలో 10 సార్లు సవరించారు.
మొదటి సవరణ
భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చింది. ఆ మరుసటి సంవత్సరమే, అంటే 1951లోనే అప్పటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ మొదటి సవరణ చేసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, వామపక్షవాదులూ భారతీయ జనతా పార్టీ వాక్‌స్వాతంత్ర్యాన్ని హరించేస్తోందంటూ గగ్గోలు పెడుతుండడం చూస్తున్నాం కదా. నిజానికి రాజ్యాంగానికి మొదటి సవరణలోనే అప్పటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ వాక్‌స్వాతంత్ర్యానికి ఆంక్షలు విధించారు. ‘భావప్రకటనా స్వేచ్ఛకు సహేతుక ఆంక్షల’ పేరిట రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణాన్ని సవరించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ చేసిన ఆ సవరణను డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా నిరసించారు. ‘‘మీరు రాజ్యాంగాన్ని చిత్తుకాగితంలా పరిగణిస్తున్నారు’’ అంటూ నెహ్రూను విమర్శించారు. అయినప్పటికీ పార్లమెంటులో సంఖ్యాబలం ఉండడంతో నెహ్రూ ఆ సవరణను పాస్ చేయించుకున్నారు.
ఎమర్జెన్సీ : చీకటి అధ్యాయం
భావప్రకటనా స్వేచ్ఛకు ఆంక్షలు విధించడంతోనే రాజ్యాంగ సవరణల పరంపర మొదలైంది. స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించడాన్ని చెబుతారు. ప్రతిపక్ష నేతలందరినీ జైళ్ళలో నిర్బంధించి రాజ్యాంగానికి 42వ సవరణ చేసారు. దానికి ముందూ తర్వాతా చాలా సవరణలు చేసారు కానీ 42వ సవరణ చాలా ప్రభావవంతమైనదిగా నిలిచింది. అందుకే ఆ ఒక్క సవరణనే ‘మినీ రాజ్యాంగం’ అంటారు. ఆ సవరణే రాజ్యాంగ ప్రవేశికకు సెక్యులర్, సోషలిస్టు అనే పదాలను చేర్చింది. నిజానికి రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే ఆ పదాల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహా రాజ్యాంగ రచనా కమిటీలోని అత్యధిక సభ్యులు ఆ పదాలను తిరస్కరించారు. ‘సోషలిస్టు’ అన్న పదం భారతదేశపు ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా విధ్వంసం చేస్తుందంటూ ఆ పదాన్ని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
రాజ్యాంగానికి మొదటి సవరణ, 42వ సవరణ రెండూ అత్యంత అసాధారణ పరిస్థితుల్లో జరిగాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 16 నెలలకే మొదటి సవరణ చేసారు. అప్పటికి మొదటి లోక్‌సభ ఎన్నికలు కూడా జరగలేదు. ప్రొవిజనల్ పార్లమెంట్ మాత్రమే అధికారంలో ఉండగా తొందరతొందరగా ఆ సవరణ చేసేసారు. ఇక 42వ రాజ్యాంగ సవరణ, దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితి (ఇంటర్నల్ ఎమర్జెన్సీ) విధించి ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళలో నిర్బంధించి, ఆ సవరణ చేసారు. భారత రాజకీయాల్లో నియంతృత్వం గురించి ఎవరైనా నిజంగా వెతికితే వారి అన్వేషణ ఎమర్జెన్సీ దగ్గరే ముగుస్తుంది.
ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయడంలో అన్ని నైతిక విలువలనూ ఉల్లంఘించింది.
నిజానికి ఇందిర ప్రభుత్వపు నియంతృత్వ పోకడలు, రాజ్యాంగాన్ని సవరించేందుకు కావలసిన అపరిమిత అధికారం కోసం వాంఛ… శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సుదీర్ఘ ఘర్షణకు కారణమైంది. 1967నాటి గోలక్‌నాథ్ కేసు సందర్భంగా, ‘ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దానికి స్పందనగా ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో రాజ్యాంగానికి 24వ సవరణ చేసింది. దాని ద్వారా, ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగంలోని ఏ భాగానికైనా సవరణలు చేసే అపరిమితమైన, నిర్నిబంధమైన శక్తి పార్లమెంటుకు సమకూరింది. దాంతో 1973లో కేశవానంద భారతి కేసు తీర్పులో సుప్రీంకోర్టు ‘రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది కానీ రాజ్యాంగపు మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు’ అని తేల్చింది. ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయ సమీక్షను తగ్గించివేసి, పార్లమెంటు ఆధిక్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ విధంగా రాజ్యాంగాన్ని పెద్దస్థాయిలోనే మార్చివేసింది.
ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన పలు మార్పులను మళ్ళీ పాత పద్ధతికి మార్చేసింది. న్యాయ సమీక్షను, ప్రాథమిక హక్కులను పునరుద్ధరించింది. 1980 నాటి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ‘రాజ్యాంగపు మౌలిక స్వరూపం’ అన్న సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించింది. దాన్ని అతిక్రమించి చేసే సవరణలు చెల్లుబాటు కాబోవని తేల్చిచెప్పింది.
రాజ్యాంగాన్ని మార్చడంలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హద్దులూ, నైతిక విలువలూ లేకుండా చెలరేగిపోయింది.
భారత రాజ్యాంగంలో సవరణలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలా రాజ్యాంగాన్ని సవరించడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు కూడా. కానీ ఆ సవరణలు చేసిన రాజకీయ సందర్భాలు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాయి. ఆ సవరణలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వపు ఉద్దేశాలు, వాటి నైతిక సమర్థనల గురించి సందేహాలు కలగజేసాయి.
ఎన్నికల ప్రక్రియలో క్షీణిస్తున్న చిత్తశుద్ధి
‘రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చివేస్తుంది’ అంటూ కాంగ్రెస్, రాహుల్ గాంధీ చేసిన దుష్ప్రచారం నిజానికి తర్కదూరం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాలు మార్చేసినట్లు రాజ్యాంగాన్ని ఇంకెవరూ మార్చలేదు, మార్చలేరు కూడా. రాజ్యాంగ సవరణల్లో తమ సొంత చరిత్రను కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. నిజానికి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ప్రభుత్వ వ్యవహారాలను నేరుగా శాసించగల స్థాయిలో ఉన్నారు. ఆ సమయంలో యూపీయే ప్రభుత్వం రాజ్యాంగాన్ని 17సార్లు సవరించింది లేదా మార్చింది. ఆ సవరణలు మాత్రం రాహుల్ గాంధీకి కానీ, కాంగ్రెస్ నేతలకు కానీ గుర్తుండవు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం ఒక పవిత్ర ప్రక్రియ. ఆ ప్రక్రియ ద్వారా ప్రజలు పోటీదారులు చెప్పేవన్నీ విని, ఆ సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకుల అంతిమ లక్ష్యం ప్రజలకు నిజమైన సమాచారం అందించాలి, ఆ నిజాల ఆధారంగానే విమర్శలు చేయాలి. తప్పుడు సమాచారాన్ని అందించడం, నిరాధార ఆరోపణలు చేయడం ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను మాత్రమే కాదు, ప్రజాస్వామిక వ్యవస్థల పట్ల ప్రజల విశ్వాసాన్ని సైతం క్షీణింపజేస్తాయి. ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసాన్ని నిలబెట్టి ఉంచడం అందరి సామూహిక బాధ్యత. ప్రధానంగా, రాజకీయ నాయకుల బాధ్యత. అందువల్ల రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలకు జవాబులిచ్చి తీరాలి…
— భారత రాజ్యాంగాన్నే తొలగించివేసే విధంగా దాన్ని మారుస్తామని బీజేపీ ఎప్పుడు ఎక్కడ చెప్పింది?
— కాంగ్రెస్, గాంధీ-నెహ్రూ కుటుంబం బలప్రయోగం ద్వారా రాజ్యాంగంలో చేసిన సవరణలు, మార్పుల విషయంలో ఆ పార్టీ వైఖరి ఏంటి?
— రాజ్యాంగం ఏర్పడిననాటి నుంచీ అందులోనే భాగంగా ఉన్న రాజ్యాంగ సవరణకు వీలు కల్పించే అవకాశాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందా?
— రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో రాజ్యాంగం ప్రతిని ప్రజల చూపించారు కదా.. అది ఏ మార్పులూ చేయని అసలైన మొట్టమొదటి రాజ్యాంగమా లేక ఆయన పార్టీ ఎన్నో మార్పులు చేసిన తరువాతి రాజ్యాంగమా?
బాధ్యత కలిగిన లేదా బాధ్యత తెలిసిన రాజకీయ నాయకుడు ఎవరైనా, ఈ ప్రశ్నలకు పరిణతితో జవాబిస్తారు, నిర్మాణాత్మక చర్చలో పాల్గొంటారు. కానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ చేసిందేంటంటే ఒక భయానకమైన, ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించారు. ఇలాంటి చవకబారు ప్రయోగాలు చేయడం రాహుల్ గాంధీకి ఇదేమీ మొదటిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా చౌకీదార్ చోర్ హై అని సుప్రీంకోర్టే చెప్పిందంటూ అసత్యాలు ప్రచారం చేసారు. దాంతో ఆయన మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదయింది. సుప్రీంకోర్టుకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అది దేశ సర్వోన్నత న్యాయస్థానం కాబట్టి అక్కడ తుచ్ఛమైన తప్పుడు ఆరోపణలు పనిచేయలేదు. తను చేసిన పనికిమాలిన ఆరోపణలకు ఆయన బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఆయన అలాగే పచ్చి అబద్ధాలను ప్రచారం చేసారు. బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యంలో అటువంటి చర్యలకు ఆ వ్యక్తులే జవాబుదారీగా ఉండాలి.