భారతదేశాన్ని శ్రీలంకను కలిపే రామసేతువు రోదసి నుంచి ఎలా కనిపిస్తుందో తెలుసా? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రోదసిలోకి పంపించిన కోపర్నికస్ సెంటినెల్ 2 అనే ఉపగ్రహం రామసేతును ఫొటో తీసింది.
రామాయణం ప్రకారం వానరులు పెద్దపెద్ద రాళ్ళతో ఆ వారధిని నిర్మించారన్న సంగతి తెలిసిందే. వాస్తవంలో కూడా అది పెద్ద సున్నపురాతి దిబ్బల వరుస అని, ఆ సమాహారం భారత్ నుంచి శ్రీలంక వరకూ ఉందనీ శాస్త్రవేత్తలు చెబుతారు. పాశ్చాత్య ప్రపంచం దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తుంది.
రామసేతువు భారతదేశపు ఆగ్నేయభాగాన చిట్టచివర ఉన్న రామేశ్వరం ద్వీపాన్నీ, శ్రీలంకలోని మన్నార్ దీవినీ కలుపుతూ 48 కిలోమీటర్ల పొడవున ఉన్న వారధి. అది హిందూమహాసముద్రపు పాయ అయిన గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను, బంగాళాఖాతపు పాయ అయిన పాక్ జలసంధినీ వేరుచేస్తుంది.
రామసేతు మానవ నిర్మితమైన వారధి అని రామాయణం చెబుతుంది. కానీ, అది మనుష్యులు కట్టినది కాదని, ప్రకృతి సహజంగా ఏర్పడినది మాత్రమేననీ, దాన్ని కూల్చేసినంత మాత్రాన నష్టమేమీ లేదనీ మన్మోహన్ సింగ్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే వాదించింది. భౌగోళిక శాస్త్ర ఆధారాల ప్రకారం సున్నపురాయి దిబ్బల వరుసగా ఉన్న ఈ సేతువు ఒకప్పుడు భారతదేశాన్నీ, శ్రీలంకనూ కలిపేది.
‘‘ఆ ప్రకృతి సహజమైన బ్రిడ్జి 15వ శతాబ్దం వరకూ సముద్రాన్ని దాటడానికి వీలుగా ఉండేది. ఆ తర్వాత క్రమంగా ఆ బ్రిడ్జి క్షీణించిపోయింది’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెప్పింది.
రామసేతు దగ్గర సముద్రం పెద్ద ఎక్కువ లోతు ఉండదు. కేవలం పది మీటర్ల లోపే లోతుగా ఉంటుంది. అందువల్లే అక్కడ నీరు లేతరంగులో కనిపిస్తుంటుంది.
శ్రీలంకలోని మన్నార్ దీవి సుమారు 130 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఆ దీవినీ శ్రీలంకనూ కలుపుతూ ఒక రోడ్ బ్రిడ్జి, ఒక రైల్వే బ్రిడ్జి ఉన్నాయి. ఇక భారతదేశం వైపు చూస్తే రామేశ్వరం ద్వీపం ఉంది. దాన్నే పంబన్ దీవి అని కూడా అంటారు. పంబన్, రామేశ్వరం పట్టణాల మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్రాన్ని దాటి పంబన్ దీవి వరకూ వెళ్ళడానికి 2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి కట్టారు.
భారత్, శ్రీలంక రెండువైపులా రామసేతువు పరిసరాలను పరిరక్షిత జాతీయవనాలుగా ఇరుదేశాలూ గుర్తించాయి. ‘‘రామసేతు దగ్గరున్న ఇసుకదిబ్బలు పలురకాల పక్షులు, చేపలు పెరిగే ఆవాసాలు. లోతు తక్కువగా ఉండే అక్కడి సముద్ర జలాలపై ఆ పక్షులు, చేపలు ఆధారపడి జీవిస్తుంటాయి. రామసేతు పరిసరాల్లో డాల్ఫిన్సు, డుగాంగ్‌లు, తాబేళ్ళూ ఇంకా ఎన్నో అరుదైన సముద్రజీవులు ఉన్నాయి’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు