తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో కల్తీమద్యం త్రాగి 53మంది మరణించిన ఘటనలో ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. కరుణాపురం గ్రామానికి కల్తీమద్యం సరఫరా చేసిన చిన్నదురై అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.
కల్తీమద్యం ఘటనలో 193 మంది ఆస్పత్రి పాలయ్యారు. వారిలో 53మంది మరణించారు. శుక్రవారం సాయంత్రం వరకూ 29మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అందజేసామని, వారి సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ వెల్లడించారు. మిగతా 140మందీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, కొంతమంది మాత్రం ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారనీ వివరించారు.
కల్లకురిచి కల్తీమద్యం ఘటనను విచారించడానికి విశ్రాంత న్యాయమూర్తి బి గోకుల్దాస్తో నియమించిన ఏకసభ్య కమిషన్, విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక రూపొందించడానికి ప్రభుత్వం ఆయనకు మూడు నెలల గడువు విధించింది. మరోవైపు, ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయడంతో పాటు పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ప్రధాన అనుమానితుణ్ణి కూడా అరెస్ట్ చేసారు.
రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు, తిరుచిరాపల్లి జిల్లాలో 250 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసారు.
ఈ దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ స్టాలిన్ రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్నాడిఎంకె నేత ఎడప్పాడి పళనిస్వామి స్టాలిన్‌ను ‘అసమర్ధుడు’ అని విమర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలై, తమిళనాడులో కనీసం వెయ్యి మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వానికి సూచించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు