నీట్ పరీక్ష వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకముందే మరో వివాదం మొదలైంది. ఇటీవల నిర్వహించిన యుజిసి-నెట్ పరీక్షను కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. పరీక్ష జరిగిన మరునాడే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) మంగళవారం నాడు యుజిసి-నెట్ పరీక్ష నిర్వహించింది. 9లక్షల మందికి పైగా అభ్యర్ధులు పరీక్ష రాసారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు లేదా జెఆర్ఎఫ్ ఫెలోషిప్లు వస్తాయి.
జాతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రానికి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ అనలిటిక్స్ యూనిట్ నుంచి యుజిసికి నెట్ పరీక్ష గురించి జూన్ 19న ఒక సందేశం అందింది. నెట్ పరీక్ష నిర్వహణ నిష్పాక్షికంగా జరలేదంటూ ఆ సందేశంలో సమాచారం ఉంది. పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దాని సారాంశం.
ఆ నేపథ్యంలో, పరీక్ష ప్రక్రియ విషయంలో అత్యున్నత పారదర్శకత పోషించడానికి గాను, నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. మళ్ళీ తాజాగా పరీక్ష నిర్వహిస్తామనీ, దాని కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలనీ వెల్లడించింది.
పరీక్ష పత్రం లీక్ అయి ఉంటుందన్న అనుమానాలున్నాయి. అయితే వాటికి ఆధారాలు లేవు. ఈ కేసును దర్యాప్తు నిమిత్తం సిబిఐకి అప్పగించినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
యుజిసి నెట్ పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు – జూన్లోను, డిసెంబర్లోనూ – నిర్వహిస్తారు. ఈ యేడాది జూన్ 18న పరీక్ష జరిగింది. దానికి దేశవ్యాప్తంగా 11,21,225 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. దేశంలోని 317 నగరాల్లో 1205 కేంద్రాల్లో నెట్ పరీక్ష నిర్వహించారు.