వరదలతో ఈశాన్య రాష్ట్రం అస్సాం అల్లాడుతోంది. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. వాగులు, వంకలు పొంగడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 15 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. రహదారులు ధ్వంసం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నివాసాల్లోకి వరద చేరడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.
నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం కరీంగంజ్ ఎక్కువగా ప్రభావితం అయింది. అక్కడ సుమారు 1,52,133 మంది వరదనీటిలో చిక్కుకుపోయారు. 1,378.64 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ప్రస్తుతం 24 రెవెన్యూ సర్కిళ్ళలో 470 గ్రామాలు నీట మునిగాయి.
బిస్వనాథ్, హోజాయ్, బొంగైగావ్, నల్బరీ, తముల్పూర్, ఉదల్గురి, దర్రాంగ్, ధేమాజీ, హైలాకండి, కరీంగంజ్, గోల్పరా, నాగావ్, చిరాంగ్, కోక్రాఝర్ లో వరదప్రభావం ఎక్కువగా ఉంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది పాల్గొన్నారు.